logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు:పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం

పత్రిక ప్రకటన
మార్చి 13, 2026 – ఆదిలాబాదు:


రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితర ఉన్నతాధికారులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా పరిస్థితి, రైతులకు సాగునీటి అందుబాటు, ఇతర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగినంత స్టాక్ అందుబాటులో ఉంచామని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల లభ్యతపై వ్యాప్తి చెందుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: జిల్లా కలెక్టర్ రాజర్షిషా

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా కలెక్టరేట్ విసి హాల్ నుండి నుంచి పాల్గొన్న అనంతరం అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో రైతుల పంటలకు అవసరమైన సాగునీరు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని, వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్యాస్ రీఫిల్లింగ్ గడువును 15 రోజుల నుండి 20 రోజులకు పెంచడం జరిగిందని, దీనివల్ల ఎటువంటి కొరత ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో సిలిండర్ల స్టాక్ తగినంతగా అందుబాటులో ఉందని కలెక్టర్ వివరించారు. ప్రజలు అనవసరంగా భయాందోళనతో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు, గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ లేదా సరఫరలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939 కు సంప్రదించి తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ సురేందర్ రావు, ఎస్ఈ ప్రభుకళ్యాణ్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, పౌరసరఫరాల అధికారి నందిని, మార్కెటింగ్ అధికారి గజానన్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment