రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా లెక్కల ధరణి కుమార్,కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు కె.హరిప్రసాద్, ఎం.మంజునాథ్ ల నియామకం
కదిరి: ఆంధ్రప్రదేశ్‌లో మూడవ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (RPC) పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నియామకాలు చేపట్టింది. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా లెక్కల ధరణి కుమార్, కదిరి మరియు పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లుగా కొట్టం హరిప్రసాద్, మంకముతక మంజునాథ్ లను పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ అధికారికంగా నియమించారు.
ఈ నియామకాలు ఏపీ రాష్ట్ర శాఖ కో-ఆర్డినేటర్ పంగులూరి బుచ్చిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. కొమ్మోజు రమేష్ ల సిఫార్సు మేరకు జరిగినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కదిరి బస్ స్టాండ్ సెంటర్‌లోని హోటల్ అత్తార్ రెసిడెన్సీలో పార్టీ సెక్యులర్స్‌తో జరిగిన అంతర్గత సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కులు రోజురోజుకు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా విలువలు తగ్గిపోతున్నాయని, రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలకు మరియు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు.
అపారమైన ఖనిజ సంపద కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరికంతో మగ్గిపోకుండా ప్రజా చైతన్యంతో కూడిన ఉద్యమం అవసరమని, రాష్ట్ర సంపదను రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి వినియోగించేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్లు, 28 జిల్లాలకు అధ్యక్షులు మరియు కార్యదర్శులను నియమించేందుకు కార్యాచరణ కొనసాగుతోందని తెలిపారు.
ఇదే సందర్భంగా నూతనంగా నియమితులైన లెక్కల ధరణి కుమార్, కొట్టం హరిప్రసాద్, మంకముతక మంజునాథ్ మాట్లాడుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్య బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ ఆశయాలను నెరవేర్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధి, భద్రతతో కూడిన భవిష్యత్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వంకర మురళి నాయుడు, ధర్మవరపు శ్రీనివాసరావు, ఎస్.కే. హాసన్ వలి తదితరులు పాల్గొన్నారు.