logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నైపుణ్యంలో ఫస్ట్‌.. తలసరిలో లాస్ట్‌..కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నివేదికలో కీలక విషయాలు వెల్లడి

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లాకు సంబంధించి అనేక ఆసక్తికరమైన, ఆందోళనకరమైన గణాంకాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ అధికారిక నివేదికల ప్రకారం.. ఒకవైపు పారిశ్రామిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధిలో సిక్కోలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుండగా, ప్రజల జీవన ప్రమాణాలకు అద్దం పట్టే 'తలసరి ఆదాయం', పారిశుధ్య నిర్వహణ (స్వచ్ఛాంధ్ర)లో అట్టడుగున ఉండి నిరాశపరుస్తోంది.

స్కిల్‌ టెస్టులో..

రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం నిర్వహిస్తున్న లక్ష నైపుణ్య పరీక్షల (స్కిల్‌ స్ర్కీనింగ్‌ టెస్టులు) నమోదులో జిల్లా యువత సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 32 సెక్టార్లలో ఏకంగా 6,412 మంది యువత రిజిస్టర్‌ చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

తలసరి ఆదాయం..

జిల్లా స్థూల ఉత్పత్తి వృద్ధిబాటలోనే ఉన్నప్పటికీ, సామాన్యుడి ఆదాయం పెరగకపోవడం కలవరపెడుతోంది. 2025-26కు గాను జిల్లా జీడీపీ రూ.48,072 కోట్లగా అంచనా వేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 10.67 శాతం వృద్ధి సాధించింది. ఇందులో పారిశ్రామిక రంగం రూ. 8,688 కోట్లతో అత్యధికంగా 16.74 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. సేవారంగం రూ.22,261 కోట్లతో (13.05 శాతం వృద్ధి), వ్యవసాయ రంగం రూ. 13,367 కోట్లతో (2.48 శాతం వృద్ధి) పురోగతి సాధించాయి. జిల్లా స్థూల ఉత్పత్తి పెరిగినా, ప్రజల తలసరి ఆదాయం మాత్రం రూ. 1,82,508 వద్దే నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలోనే జిల్లా ఏకంగా 26వ స్థానంలో (అట్టడుగున) ఉండటం అధికారుల వైఫల్యాన్ని, ప్రాంతీయ అసమానతలను ఎత్తిచూపుతోంది.

స్వచ్ఛాంధ్రలో అట్టడుగున..

స్వచ్ఛాంధ్ర-2026 లక్ష్యాలు, మురుగు నీటి శుద్ధి, పారిశుధ్య నిర్వహణ విభాగాల్లో రాష్ట్రంలో 'బాటమ్‌ పెర్ఫార్మన్స్‌'లో మొదటి స్థానంలో (అట్టడుగున) జిల్లా నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని 19 మురుగు నీటి శుద్ధి (ఎస్‌టీపీ) ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 4.09 ఎకరాల భూమిని తక్షణమే కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 'స్వచ్ఛ సర్వేక్షన్‌-2025' కోసం శ్రీకాకుళం (రివర్‌-కోస్టల్‌ టౌన్‌ అవార్డు రేసులో), పలాస-కాశీబుగ్గ(స్వచ్ఛ షెహార్‌ జోడీ, కోస్టల్‌ టౌన్‌, ఫాస్టెస్ట్‌ మూవర్‌ రేసులో) మునిసిపాలిటీలను ప్రత్యేకంగా ఎంపిక చేసి ఫోకస్‌ పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

వ్యవసాయ కేపీఐలో..

రాష్ట్రస్థాయి కీ పెర్మార్మన్స్‌ ఇండికేటర్స్‌ (కేపీఐ)లో 'ఎకానమీ-అగ్రి, అలైడ్‌ సెక్టార్‌' కింద శ్రీకాకుళం జిల్లా 40 సూచికలకు గాను 90 స్కోరుతో ఏ+ గ్రేడ్‌ సాధించి రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. సర్వీస్‌ సెక్టార్‌లో 93 స్కోరుతో ఏ+ గ్రేడ్‌, ఇండస్ట్రీ సెక్టార్‌ లో 85 స్కోరుతో (ఏ) గ్రేడ్‌లో నిలిచింది. 311 ఓవరాల్‌ కేపీఐ సూచికలకు గాను 84 స్కోరుతో 'ఏ గ్రేడ్‌' 14వ ర్యాంకు తెచ్చుకుంది. ఏఐ అగ్రోనమిస్ట్‌ సేవలందించే 'ఫార్మర్‌ యాప్‌'లో జిల్లా నుంచి 20,128 మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల అధికారులు సైతం 41 శాతం యాక్టివ్‌ లాగిన్స్‌తో ముందున్నారు.

పొందూరు ఖాదీ, పలాస జీడిపప్పు..

'వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ప్రొడక్ట్‌' (ప్రొడక్ట్‌ పర్ఫెక్షన్‌) కింద జిల్లా నుంచి పొందూరు ఖాదీ (కాటన్‌ చీరలు), నాణ్యమైన పలాస జీడిపప్పు ఎంపికయ్యాయి. వీటిని గ్లోబల్‌ బ్రాండ్లగా మార్చేందుకు ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, హార్టికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖలు సమన్వయంతో మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించనున్నాయి.

రైల్వే ప్రాజెక్టులు.. ఉచిత సోలార్‌ విద్యుత్‌

జిల్లాలో మొత్తం 73 రైల్వే లెవల్‌ క్రాసింగ్‌, ఆర్వోబీ, ఆర్‌యూబీ ప్రాజెక్టులను ప్రతిపాదించగా... 54 మంజూరయ్యాయి. మరో 19 ప్రాజెక్టులు మంజూరు కావాల్సి ఉంది. పీఎం సూర్యఘర్‌ ఉచిత విద్యుత్‌ యోజనలో భాగంగా.. ఎస్సీ, ఎస్టీలకు సోలార్‌ విద్యుత్‌ అందించే ఈ (యూఎల్‌ఏ మోడల్‌) పథకంలో ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో జిల్లాలోని 16,278 మందిని (32.56 ఎండబ్ల్యూ సామర్థ్యం) లబ్ధిదారులుగా గుర్తించారు. ఇప్పటికే 12,737 ఇళ్లకు రూఫ్‌టాప్‌ సర్వే పూర్తి కాగా, 2,286 యూనిట్లకు అనుమతులు వచ్చేశాయి.

గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం..

జిల్లా వాసుల చిరకాల స్వప్నం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి సంబంధించి ప్రభుత్వ ప్రణాళిక స్పష్టమైంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(డీబీఎఫ్‌ఓటీ) విధానంలో నిర్మించనున్న ఈ ఎయిర్‌పోర్టు తొలి దశ అంచనా వ్యయం రూ.550 కోట్లు. ప్రాజెక్టు కోసం 1,383.71 ఎకరాలను ప్రభుత్వం గుర్తించగా.. 2026 మార్చి నాటికి భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌కు సీఎం నిర్దేశించారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో జాయింట్‌ డెవలప్‌మెంట్‌ కోసం డిసెంబర్‌ 2025లోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. 'రైట్స్‌' సంస్థ సర్వే కూడా పూర్తయింది. ప్రస్తుతం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ (సైట్‌ క్లియరెన్స్‌) కోసం ఎదురుచూస్తున్నారు.

- తాజా త్రైమాసిక (డిసెంబరు 2025 - ఫిబ్రవరి 2026) నివేదిక ప్రకారం జిల్లా యంత్రాంగం పనితీరుపై 70.2 శాతం సానుకూలత (పాజిటివ్‌) వ్యక్తంకాగా, 29.8 శాతం ప్రతికూలత (నెగిటివ్‌) నమోదైంది. గత డిసెంబర్‌ నాటికి జిల్లా స్కోరు 67.3గా ఉండగా, తాజా నివేదికలో అది 2.9 శాతం మేర పెరగడం గమనార్హం.

- ప్రభుత్వ పంపిణీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలుకు జిల్లాలో అత్యుత్తమ మార్కులు పడ్డాయి. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ పట్ల అత్యధికంగా 89.0 శాతం మంది ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి (87.6శాతం), అన్న క్యాంటీన్లు (84.5శాతం), పాఠశాల విద్య (84.0శాతం), గర్భిణులు-బాలింతల సేవల్లో (82.5శాతం), ఆర్టీసీ బస్సు సేవలు (82.3శాతం) కూడా ప్రజల మన్ననలు పొందాయి. రేషన్‌ పంపిణీ, రీ-సర్వే (80.9శాతం), ఫైర్‌ ఎన్‌ఓసీ (80.3 శాతం), మధ్యాహ్న భోజన పథకం (80.0శాతం) విభాగాల్లోనూ జిల్లా మంచి స్కోరు సాధించింది.

- ఇసుక వ్యవహారాల్లో గతంలో కంటే ఏకంగా 21.7 శాతం మేర పాజిటివ్‌ స్కోర్‌ పెరిగింది. అలాగే ఎఫ్‌-లైన్‌ సర్వేలో 19.0 శాతం, కాలుష్య నియంత్రణలో 13.9 శాతం, విద్యుత్‌ సేవల్లో 12.8 శాతం, ఆర్‌ఓఆర్‌ సర్వేలో 12.5 శాతం మే సానుకూలత పెరిగింది.

- ఒకవైపు సంక్షేమంలో దూసుకుపోతున్నా.. క్రీడలు, రోడ్లు, రైతాంగ సమస్యల పరిష్కారంలో యంత్రాంగం వెనుకబడి ఉన్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. క్రీడా ప్రాధికార సంస్థ సేవల్లో అత్యల్పంగా కేవలం 24.0 శాతం మాత్రమే పాజిటివ్‌ స్కోర్‌ నమోదైంది. రహదారలపై గుంతల సమస్యపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి కేవలం 51.3 శాతం పాజటివ్‌ స్కోర్‌ రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. సాగునీటి రంగం (52.8శాతం), రవాణా శాఖ పన్నులు (57.9 శాతం), యూరియా లభ్యత-ధరలు (59.9శాతం), ధాన్యం కొనుగోళ్లు (60.2శాతం) విభాగాల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉంది. గంజాయి నియంత్రణలో గతంతో పోలిస్తే సానుకూలత 1 శాతం తగ్గగా, ఆర్టీసీ బస్టాండ్ల నిర్వహణలో ఏకంగా 8.0 శాతం మేర ప్రజాదరణ పడిపోవడం గమనార్హం.

- మొత్తం మీద చూస్తే.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను పజ్రల్లోకి తీసుకెళ్లడంలో సఫలమవుతున్న జిల్లా యంత్రాంగం, ప్రజలకు అత్యవసరమైన రోడ్లు వంటి మౌలిక వసతులు, వ్యవసాయ రంగ సమస్యలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తాజా నివేదికను బట్టి తెలుస్తోంది.

నివేదికను నిశితంగా పరిశీలిస్తే..

నైపుణ్యాభివృద్ధి, అగ్రి వ్యవసాయ రంగ పనితీరు(కేపీఐ), ఎయిర్‌పోర్టు భూసేకరణ వేగవంతం కావడం జిల్లాకు అతిపెద్ద 'పాజిటివ్‌' అంశాలు. అయితే స్థానిక సంస్థల అలసత్వం వల్ల పారిశుధ్య నిర్వహణ (స్వచ్ఛాంధ్ర) పూర్తిగా అట్టడుగుకు పడిపోయింది. పారిశ్రామికంగా 16.74 శాతం అద్భుతమైన వృద్ధిరేటు నమోదైనా, అది సామాన్యుడి తలసరి ఆదాయం (26వ ర్యాంకు) పెంచడంలో విఫలమవుతోంది. పేదరికం, వలసల నివారణ జరగాలంటే జిల్లా యంత్రాంగం తలసరి ఆదాయం పెంపుపై, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి (స్పెషల్‌ డ్రైవ్‌) పెట్టాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి.

1
100 views

Comment