ఆదిలాబాద్:
*దేశాభివృద్ధికి జనగణనే దిక్సూచి*
*ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాటే*
పత్రికా ప్రకటన
మార్చి 11, 2026 –
దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు పకడ్బందీగా జరిగే జనగణనే దిక్సూచిగా ఉంటుందని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) యువరాజ్ మర్మాటే అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన “భారత జనగణన–2027” కు సంబంధించిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎస్. రాజేశ్వర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పి ఓ మాట్లాడుతూ, జనగణన నుండి జనకల్యాణం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం భవిష్యత్తు సంక్షేమ పథకాలకు ఆధారమవుతుందని, అందువల్ల ఎక్కడా పొరపాట్లు లేకుండా గణన చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా మారుమూల గిరిజన తండాల్లో ఏ ఒక్క ఇల్లు కూడా మిగలకుండా గణన నిర్వహించాలన్నారు.
అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇదని తెలిపారు. దేశంలో ఇది 16వ జనగణనగా నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వెల్లడించారు. మొదటి దశలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11, 2026 నుంచి జూన్ 9, 2026 వరకు జరుగుతుందని తెలిపారు. ఇందులో ఇంటి నిర్మాణం, వసతులు, కుటుంబ యజమాని వివరాలు తదితరంగా 33 అంశాలపై సమాచారం సేకరిస్తారని చెప్పారు. రెండో దశగా జనాభా గణన ఫిబ్రవరి 2027లో నిర్వహించి, మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని వివరించారు.
దేశంలో తొలిసారిగా ఈసారి జనగణనను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్ ద్వారా గణన చేపట్టడంతో పాటు, ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గణన ప్రారంభానికి 15 రోజుల ముందే ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి రానుంది.
ఈ శిక్షణా కార్యక్రమంలో హైదరాబాద్ జనాభా గణన విభాగం గణాంక అధికారులు ఆదెపు వినయ్, వై. జంగయ్యలు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. మార్చి 13 వరకు ఈ శిక్షణ కొనసాగనుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రవీందర్ రాథోడ్, డీపీఓ రమేష్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.