logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఒక్కరికే.... నాలుగు బాధ్యతలు - రెండు మండలాలు ఇక పరిపాలన కొనసాగేదెలా...? కొనసాగుతున్న 99 రోజుల ప్రభుత్వ "యాక్షన్ ప్లాన్"

ఒక్కరికే.... నాలుగు బాధ్యతలు - రెండు మండలాలు

ఇక పరిపాలన కొనసాగేదెలా...?

కొనసాగుతున్న 99 రోజుల ప్రభుత్వ "యాక్షన్ ప్లాన్"

"ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" పై కరువైన అధికారుల పర్యవేక్షణ

బుగ్గారం మండలంపై ఉన్నతాధికారులకు ఎందుకు ఇంత చిన్న చూపు....

ఉన్నతాధికారుల చేతివాటం కోసమేనా...? ఈ "అదనపు బాధ్యతలు"


అయ్యా...... మంత్రి వర్యా.....!
ఒక్క చూపు చూడవయ్యా...!!

బుగ్గారం మండల ప్రజల ఆవేదన


బుగ్గారం / జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సుమారు గత 40 రోజుల నుండి ఇంచార్జ్ ఎంపివో గా కొనసాగుతున్న వాసవి (జగిత్యాల అర్బన్ ఎంపివో, జగిత్యాల అర్బన్ ఇంచార్జి ఎంపిడివో ) కు అదనంగా బుగ్గారం ఎంపిడివో గా మంగళ వారం బాధ్యతలు అప్పగించారు. ఒక్కరికే నాలుగు పదవులు కట్టబెట్టడం చర్చనీయంగా మారింది. ఉన్నతాధికారుల చేతివాటం కోసమేనా...? ఈ అదనపు బాధ్యతలు అనే "పుకార్లు" కూడా జిల్లా వ్యాప్తంగా "షికార్లు" చేస్తున్నాయి.
అందులో ఒక "మహిళా అధికారిణి కి" 20 కిలో మీటర్ల దూరం గల రెండు వేర్వేరు మండలాలకు బాధ్యతలు అప్పగించడం, అందులో ఒక్కరికే నాలుగు పదవులు కట్టబెట్టడం ఉన్నతాధికారులకు తగునా....? అని జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
గతంలో ఇక్కడ పని చేసి పదవీ విరమణ పొందిన అధికారి ఒక్కరు, బదిలీపై వెళ్లిన మరి కొందరు ఉన్నతాధికారుల అండదండలతో..., చేతి వాటాలతో.... అవినీతి - అక్రమాలకు పాల్పడి మండలంలో పాలనా వ్యవస్థను నాశనం చేసి వెళ్లారని ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. అనేక ఆరోపణలతో రాష్ట్ర స్థాయి పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయాలలో, సెక్రెటరియేట్ లో మండల అధికారులపై, జిల్లా ఉన్నతాధికారులపై కూడా పలు పిర్యాదులు విచారణలో ఉన్నాయి. ఇప్పటికే సమాచార కమీషన్ లో, న్యాయ స్థానాలలో కూడా పలు కేసులు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో జగిత్యాల అర్బన్ ఎంపివో, జగిత్యాల అర్బన్ ఇంచార్జ్ ఎంపిడివో గా కొనసాగుతున్న వాసవి కి అదనంగా బుగ్గారం మండల ఎంపివో గా, ఇంచార్జ్ ఎంపిడివో గా కూడా అదనంగా మరో రెండు బాధ్యతలు అప్పగించడంలో అంతర్యం ఏమిటని యావత్ జిల్లా ప్రజానీకం, జిల్లాలోని ఇతర అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ తో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కొనసాగుతున్న సమయంలోనే నూతన ఎంపిడివో లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎంపిడివో గా కొనసాగుతున్న సుమంత్ శిక్షణ కు వెళ్లడం పట్ల ఇంచార్జ్ ఎంపివో కు మరో అదనపు బాధ్యతను ఇంచార్జ్ ఎంపిడివో గా కూడా కట్ట బెట్టారు. జగిత్యాల అర్బన్ ఎంపివో గా ఉన్న "వాసవి" కి ఇంచార్జ్ గా జగిత్యాల అర్బన్ ఎంపిడివో, బుగ్గారం ఎంపివో, ఎంపిడివో గా నాలుగు బాధ్యతలు అప్పగిస్తే ఇక పరిపాలన ఎలా...? కొనసాగుతుందోనని ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో నుండి కూడా బుగ్గారం మండలంపై ఉన్నతాధికారులకు ఎందుకు ఇంత చిన్న చూపు అని మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలనే కొద్ది - గొప్ప నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల కావడం జరిగింది. ఆ నిధుల ద్వారానే పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి ప్రస్తుత కార్యక్రమాలలో, ప్రజా పాలనలో ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ఆ బిల్లుల చెల్లింపుల కార్యకలాపాలు అన్నీ ఈ అధికారులే చూసుకోవాలి. బిల్లుల చెల్లింపులకు అప్రూవల్ ఇవ్వాలి. అధికారులు - ఉన్నతాధికారులు వారి చేతి వాటాల కోసమే ఇలా ఇంచార్జ్ లుగా వారికి అనుకూలంగా ఉన్నవారికే జిల్లాలో ఒక్కొక్కరికి రెండు - మూడు - నాలుగు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారేమో...? అనే అనుమానాలు కూడా ప్రజల్లో, ప్రజా ప్రతినిధుల్లో, పంచాయతీ రాజ్ శాఖ లో పని చేసే ఇతర అధికారులకు, సిబ్బందికి కలుగుతున్నట్లు సమాచారం. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే అధికారులే కరువయ్యారని బుగ్గారం మండల ప్రజలు మండి పడుతున్నారు. నిధులు సరిగా లేక శానిటేషన్ సక్రమంగా లేదని, అధికమైన దోమల సమస్యతో ప్రజలు అనారోగ్యాల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ లు కూడా సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామని బుగ్గారం మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.



అయ్యా...... మంత్రి వర్యా.....! ఒక్క చూపు చూడవయ్యా...!!

ఈ ప్రాంత ఎమ్మెల్యే గా, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రిగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా పర్యవేక్షించి బుగ్గారం మండలం పై జిల్లా ఉన్నతాధికారుల చిన్నచూపు, ఇంచార్జ్ ఎంపివో, ఎంపిడివో పదవులపై జేర్రంత కన్నేసి పూర్తి స్థాయి అధికారులను శాశ్వతంగా నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు సక్రమంగా నిర్వహింప జేయాలని, శానిటేషన్, రోడ్లు, డ్రైనేజీ ల పనులు పూర్తి చేయించాలని యావత్ మండల ప్రజలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

1
0 views

Comment