logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెంగ్లీషు భాషోద్యమం: మన ఊరు – మన భాష – మన చదువు.. పిల్లల భవిష్యత్తు కోసం కిల్లాడ సత్యనారాయణ పోరు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ‘ఆగండి వినండి ఆలోచించండి. ఇది కేవలం భాష గురించి కాదు, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద ప్రమాదం’ అంటూ తెంగ్లీషు భాషోద్యమాన్ని ప్రారంభించిన కిల్లాడ సత్యనారాయణ, ఐపీఎస్ (విఆర్‌ఎస్), అడిషనల్ డీజీపీ గ్రామీణ పిల్లల చదువు గురించి హృదయస్పర్శి ఆవేదన వ్యక్తం చేశారు.తెలుగు మీడియం కేంద్రంగా ఇంగ్లీషు సాంకేతిక పదాలతో ‘తెంగ్లీషు’ విధానాన్ని అమలు చేసి, పిల్లల్లో భావ వ్యక్తీకరణ, మేధోవికాసం, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ఏ పార్టీకీ, ప్రభుత్వానికీ వ్యతిరేకం కాదు, పూర్తిగా రాజకీయ అతీతమని స్పష్టం చేశారు.తాను ఒకటో తరగతి నుంచి ఎమ్‌ఏ వరకు తెలుగు మీడియంలో చదివి, తెలుగులోనే ఐపీఎస్ పరీక్ష రాసి సీనియర్ ఐపీఎస్‌గా ఉత్తరప్రదేశ్‌లో పని చేసినట్టు, ఇంగ్లీషులో రెండు పుస్తకాలు కూడా రాశానని గుర్తు చేసుకున్నారు. ‘భాష ఒక మాధ్యమం మాత్రమే. భావం ఉంటే భాష తాను వస్తుంది. భావం మాతృభాషలోనే వికసిస్తుంది’ అంటూ డా. సి. నారాయణ రెడ్డి మాటలను ఉదహరించారు. తెలుగు మీడియంలో చదివి ఐఏఎస్ పరీక్ష తెలుగులోనే రాసి దేశంలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ, ఉత్తరప్రదేశ్‌లో సెక్రటరీలుగా పని చేస్తున్న రంగారావు, గుర్రాల శ్రీనివాస్, చంద్రకళల వంటి వారు తెలుగు బలాన్ని చూపారని ఉదాహరణలు చెప్పారు.శ్రీనివాస రామానుజన్ తమిళంలో ఆలోచించి ప్రపంచ గణితాన్ని మార్చినట్టు, ఐన్‌స్టీన్ జర్మన్‌లో, అబ్దుల్ కలాం తమిళంలో చదివి మహానుభావులయ్యారని పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియం వల్ల పిల్లలు తెలుగులో ఆలోచించి ఇంగ్లీషులో తర్జుమా చేసుకుంటూ శక్తి కోల్పోతున్నారని, ‘మమ్మీ-డాడీ’ అనడం వినసొంపుగా అనిపించవచ్చు కానీ ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి క్షీణిస్తాయని హెచ్చరించారు. మాతృభాషలో చదువు వల్ల మేధోవికాసం, సృజనాత్మకత పెరిగి, గణితం-సైన్స్ సులభమవుతాయని, గ్రామీణ-నగర అసమానతలు తగ్గుతాయని చెప్పారు. బెంగాలీ మీడియంలో చదివి జగదీశ్ చంద్ర బోస్ స్వతంత్ర పరిశోధన చేసినట్టు పల్లెల్లోని పిల్లలు కూడా మాతృభాషతో పోటీ పడగలరని, జర్మనీ, జపాన్, చైనా వంటి దేశాలు తమ మాతృభాషలోనే విద్యాభ్యాసం చేసి బలపడ్డాయని గుర్తు చేశారు.నర్సీపట్నం చుట్టుపక్కల ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు ఢిల్లీ ప్రముఖ సంస్థలతో ముడిపడి తక్కువ ఖర్చుతో ఐఐటీ, నీట్, ఐఏఎస్, ఐపీఎస్, క్లాట్, సీయూఈటి కోచింగ్ ఆన్లైన్‌లో అందించేందుకు కృషి చేస్తున్నానని ప్రకటించారు. ప్రైవేటు స్కూళ్లలో లక్షలు ఖర్చు చేసి మానసిక ఒత్తిడికి గురైన పిల్లలకు మండల కేంద్రాల్లో ఈ సౌకర్యాలు కల్పిస్తానని, పది వేలలో వంద మంది మాత్రమే విజయం పొందుతున్న మిగిలినవారి భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు. ఫిజిక్స్ వాలా (PW) 6-12, ఎడుస్కోప్ 6-10, వేదాంటు తెలుగు, ప్రతిభ, అక్షరం ఎడ్యుకేషన్స్ వంటి యూట్యూబ్ ఛానెళ్లను సిఫార్సు చేస్తూ, ఉపాధ్యాయులు పాఠం ముందు వీడియోలు చూపించి ప్రశ్నలతో ప్రారంభించాలని కోరారు.ప్రతి జిల్లాలో ‘తెంగ్లీషు భాషోద్యమ కార్యాలయాలు’ ఏర్పాటు చేస్తానని, పిల్లలు భయం, భాష పోరాటం లేకుండా ఆనందంతో చదవాలని ప్రజలను కదులించారు.

0
57 views

Comment