అమెరికా-ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదం ఇరాన్ పై చేస్తున్న అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలి- విమలక్క
నల్గొండ: 08-03-26 ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్ లో(తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం) వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండు తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ.అమెరికా,ఇజ్రాయిల్ దేశాలు ఆధిపత్యం కోసం ఇరాన్ పై దాడులు చేస్తూ వందలాది మందిని హత్య చేస్తుందన్నారు. యుద్ధనీతిని మరచి హాస్పిటల్స్,బడుల మీద బాంబులు వేస్తూ చిన్న పిల్లలను సైతం హతమారుస్తున్నారని వీరి చర్య అత్యంత దుర్మార్గమైనదన్నారు. అణ్వస్త్రాలు ఉన్నాయని నెపంతో దాడులు చేస్తూ గల్ఫ్ దేశాలు అన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అమెరికా యుద్ధాలు చేస్తుందన్నారు.వినని దేశాల మీద బాంబు దాడులు ప్రయోగిస్తూ హత్యలు కొనసాగిస్తూ తన అనుకూలులతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందని, అందులో భాగమే ఈ యుద్ధాలన్నారు.మా దగ్గర అపరిమితంగా ఆయుధాలున్నాయని ఎవరైనా నేను(అమెరికా)చెప్పింది వినకుంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని హెచ్చరించడం సరైంది కాదన్నారు.ఐక్యరాజ్యసమితిని కూడా లెక్కచేయకుండా వ్యవహరించే ట్రంపు నరహంతకుల వరుసలో చేరాడని,చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటున్న వారి మాటలను లెక్కచేయకుండా యుద్ధమే పరిష్కారం అన్నట్లు ప్రపంచ దేశాలకు హెచ్చరిక చేస్తూ ఆయిల్ కంపెనీలు ఉన్న దేశాలన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఇలాంటి చర్యలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు మేధావులు ఖండించాలని కోరారు.అట్లాగే సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాల్లో బలవుతున్న పిల్లలు, స్త్రీలు,అమాయకులను కాపాడుకోవాలని,స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనంకై పోరాడాలని పిలుపు నిచ్చారు.కుల-వర్గ పితృస్వామ్య దోపిడీ అంతంకై పోరాడాలన్నారు.
పితృస్వామ్య సంస్కృతి, ఆర్థిక-రాజకీయ పెత్తనం నశించాలన్నారు.ఇరాన్ పై, పశ్చిమ ఆసియా పై సామ్రాజ్యవాద దాడులను వెంటనే నిలిపివేయాలని,
ప్రజలు శాంతి-ఉపాధి -అభివృద్ధిని కోరుకుంటున్నారని, విధ్వంసకర యుద్ధాలను ఆపాలని డిమాండ్ చేశారు.మార్చి 8 పోరాట స్ఫూర్తిని సావిత్రిబాయి సామాజిక విప్లవకృషిని ఎత్తి పడదామంటూ.
సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి కృషితో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో స్పర్శ అధ్యయన వేదిక నాయకులు కాకి భాస్కర్,మానవ హక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షులు,చింతమల్ల గురూజీ,మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు వీరస్వామి,అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు: సి.అనిత, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెబోయిన జానీ, రైతు-కూలీ సంఘం నాయకులు బొమ్మ కంటి కొమరయ్య,బంటు రామలింగయ్య వెంకటేశ్వరరావు,మరియు జహీరా బేగం,రాజు,వెంకటయ్య,నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.