టీటీడీ డిజిటల్ ప్రోక్యూర్మెంట్ మరియు టెండర్ పోర్టల్ అభివృద్ధిపై అదనపు ఈవో సమీక్ష*
*టీటీడీ డిజిటల్ ప్రోక్యూర్మెంట్ మరియు టెండర్ పోర్టల్ అభివృద్ధిపై అదనపు ఈవో సమీక్ష*
తిరుమల, 2026 మార్చి 07: టీటీడీలో వస్తువుల కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ ప్రోక్యూర్మెంట్ మరియు టెండర్ పోర్టల్ అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శనివారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు మరియు టెండర్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు పలు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేడియంట్ ఇన్ఫోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వెబ్ సైట్ ప్రోటోటైప్, డిజైన్ పై అధికారులతో కలిసి చర్చించారు.
*సమావేశంలోని ముఖ్యాంశాలు*
• టెండర్ ప్రక్రియలో పాల్గొనదలిచిన సరఫరాదారులు ముందుగా పోర్టల్లో ఆన్లైన్ ద్వారా నమోదు కావాలి.
• నమోదైన సరఫరాదారుల వివరాలు, అర్హతలు మరియు నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించి అర్హత కలిగిన సరఫరాదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు.
• భవిష్యత్ కొనుగోలు ప్రక్రియలకు ఉపయోగపడే విధంగా ధ్రువీకరించిన సరఫరాదారుల విశ్వసనీయ డేటాబేస్ రూపొందించబడుతుంది.
• ఈ వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తులను గుర్తించి తొలగించడం సాధ్యమవుతుంది. దీంతో టెండర్లలో నిజమైన సరఫరాదారులకు సమాన అవకాశాలు కల్పించబడతాయి.
• మార్కెట్ ధోరణులు, ధరల మార్పులు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.
• టెండర్ ప్రక్రియ, సరఫరా నిర్వహణ, చెల్లింపుల వ్యవస్థలను ఒకే వేదికపై సమగ్రంగా అనుసంధానమవుతాయి.
• డిజిటల్ విధానంలో చెల్లింపులు వేగంగా జరిగేలా ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీని ద్వారా సరఫరాదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.
• పారదర్శక వ్యవస్థ కారణంగా ఎక్కువ మంది అర్హత కలిగిన సరఫరాదారులు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
• ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించబడుతుంది.
ఈ సమావేశంలో అడిషనల్ ఎఫ్ఏ&సీఏఓ రవి ప్రసాదు, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ వెంకట రమణ, టీటీడీ ప్రోక్యూర్ మెంట్ జీఎం శ్రీమతి పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.