దప్పిక తీర్చేదెవరు? ఆళ్లగడ్డలో కనిపించని చలివేంద్రాలు!
AIMA న్యూస్ నంద్యాల జిల్లా. బ్యూరో. వేసవి కాలం ప్రారంభమై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇవాళ శనివారం మరీ ఎండలు ఎక్కువ కావడంతో ఉదయం 9 గంటలకే ఎండ సెగలు మొదలవుతున్నాయి. కానీ, ఆళ్లగడ్డ మున్సిపల్ పరిధిలో మాత్రం ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు ఎక్కడా కనిపించడం లేదు. మున్సిపల్ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఏటా ఎండలు మొదలవ్వగానే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, నాలుగు రోడ్ల సెంటర్ ,బస్టాండ్ ఆవరణ, మార్కెట్ ప్రాంతం , మున్సిపల్ ఆఫీస్ ఎమ్మార్వో ,పోలీస్ స్టేషన్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎండలు ముదురుతున్నా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
బస్సు దిగి ఊరిలోకి వెళ్లే ప్రయాణికులు మంచినీళ్ల కోసం కిరాణా షాపుల్లో డబ్బులు పెట్టి బాటిళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.రోజంతా కష్టపడే కార్మికులు, కూలీలు, చిరు వ్యాపారులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.
మున్సిపాలిటీకి ప్రజలు చెల్లించే పన్నులు ఏమౌతున్నాయని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. లక్షల రూపాయల బడ్జెట్ ఉన్నా, కనీసం ఒక కుండ నీరు, మజ్జిగ ఇచ్చే తీరిక అధికారులకు లేదా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కాగితాలకే పరిమితమైన ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు కావడం లేదని జనం నిలదీస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.