భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్..
ఇరాన్ తో అమెరికా యుద్ధ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు 30 రోజుల పాటు రష్యా నుండి చమురు కొనుగులో చేయడానికి అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు గతంలో రష్యాపై విధించిన ఆంక్షల నుండి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. కొనుగోలుదారులు లేక నెలల తరబడి సముద్రంలో చిక్కుకున్న రష్యన్ చమురు నౌకలకు ఇది భారీ ఊరట కల్పించినట్టయింది. చమురు సంక్షోభాన్ని నివారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ ముడిచమురు మార్కెట్‌పై ఒత్తిడి పడింది. క్రూడాయిల్ ను ఉత్పత్తి చేసే దేశాలన్నీ కూడా ఈ యుద్ధం వల్ల తలెత్తిన దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటోన్నాయి. ఇరాన్ నుంచి ప్రతి దాడుల బారినా పడ్డాయి. దీంతో పాటు క్రూడాయిల్ రవాణాలో అత్యంత కీలకంగా ఉండే హార్ముజ్ జలసంధిను ఇరాన్ మూసివేయడం.. ఈ పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసినట్టయింది. ఈ నేపథ్యంలో భారత్ లో ముడి చమురు సంక్షోభం తలెత్తవచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
ఈ పరిణామాల మధ్య అమెరికా తాజా నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ పై క్రూడాయిల్ సంక్షోభ ఒత్తిడిని నివారించేలా 30 రోజుల అనుమతులు మంజూరు చేసింది. రష్యా ఇంధన రంగం, క్రయ విక్రయాలపై పలు రకాల కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు తెలిపింది. ఇది తాత్కాలికమే. 30 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి దీన్ని పొడిగించే అవకాశాలు లేకపోలేదు.
అమెరికా ఆంక్షలు, చెల్లింపులు, బీమా అనిశ్చితితో రష్యా చమురు ట్యాంకర్లు సముద్రంలో రోజుల తరబడి నిలిచిపోయాయి. రష్యన్ ఆయిల్ షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో నౌకల బీమా, పోర్టు ప్రవేశంపై సందేహాలు తలెత్తాయి. నిబంధనల ఉల్లంఘన భయంతో భారత రిఫైనరీలు కొనుగోళ్లకు వేచి చూశాయి. అమెరికా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా ఇండియన్ పోర్టులకు చేరవచ్చు.
ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా ఈ ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తూ, పరోక్షంగా ఆ దేశ ఆర్థిక పరిపుష్టికి భారత్ సహకరిస్తోందనే కారణంతో గతంలో 25 శాతం అదనపు టారిఫ్ ను సైతం విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత పరిస్థితులు సద్దమణిగాయి. రష్యా నుండీ క్రూడాయిల్ ను కొనుగోలు చేయడాన్ని గణనీయంగా తగ్గించింది భారత్.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్.. రష్యన్ ముడిచమురు కొంటోన్నాయి. ఆయా రిఫైనరీలన్నీ కూడా ఇప్పటికే సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి.