logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సహజీవనం.. ఆపై బెదిరింపులు...వీడిన మోహనరావు హత్యకేసు మిస్టరీ

Srikakulam: ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ వెంకన్నగారిపేటలో గత నెల 26న జరిగిన పైలా మోహనరావు(40) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.నిందితుడిని అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వాంబే కాలనీకి చెందిన మోహనరావు.. టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తూ, చిట్టీల వ్యాపారం చేస్తూ, హిజ్రాల సంఘానికి నాయకుడిగా(నాయక్‌) వ్యవహరించేవాడు. ఆయనకు భార్య, పదో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. కాగా, హయాతీనగర్‌కు చెందిన ఆలబోయిన ఢిల్లీశ్వరరావు(21) మునిసిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారుల వద్ద ఆశీలు వసూలు చేస్తుంటారు. ఢిల్లీశ్వరరావు, మోహనరావు మధ్య పరిచయం ఏర్పడి, సహజీవనానికి దారితీసింది. తమ సంబంధాన్ని మోహనరావు హిజ్రాలకు చెప్పడంతో ఆ విషయం అందరికీ తెలిసిపోయిందని, తన జీవితానికి భద్రత లేదని ఢిల్లీశ్వరరావు కొన్నాళ్ల కిందట నిలదీశాడు. దీంతో నెలకు రూ.10 వేలతోపాటు, రూ.10 లక్షల విలువ గల ఇల్లు కట్టిస్తానని మోహనరావు అతనికి హామీ ఇచ్చాడు. కానీ, ఆ హామీ నెరవేర్చకపోవడంతో ఢిల్లీశ్వరరావు ఆక్రోశం పెంచుకున్నాడు.

మద్యం పార్టీకి పిలిచి.. ప్రాణం తీసి..

కొన్నాళ్ల కిందట ఇద్దరూ సమావేశమయ్యారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే తమ సంబంధం గురించి మీ ఇంట్లో చెప్పేస్తానని ఢిల్లీశ్వరరావు బెదిరించాడు. దీంతో 'నువ్వు ఇటువంటి వాడివని తెలిసే నాకున్న గుప్త రోగాన్ని నీకు అంటించాను' అని మోహనరావు అన్నారు. దీంతో ఢిల్లీశ్వరరావు.. మోహనరావును హతమార్చేందుకు కుట్ర పన్నాడు. గత నెల 26న ఢిల్లీశ్వరరావు.. పార్టీ చేసుకుందామని, తన మేనల్లుళ్లు కూడా వచ్చారని చెప్పి మోహనరావును పొన్నాడ తోట వద్దకు పిలిచాడు. మోహనరావు తోటపాలెం వద్ద ఓ దుకాణంలో ఆరు బీర్లు, ఓ బ్రాందీ కొనుగోలు చేసి అక్కడికి వెళ్లాడు. రాజుగారి తోట వద్ద కారులో కూర్చున్న మోహనరావుపై ఢిల్లీశ్వరరావు అకస్మాత్తుగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కారుడ్రైవర్‌ ప్రశాంత్‌ను కూడా చంపుతానని బెదిరించాడు. దీంతో ప్రశాంత్‌తో పాటు కారులో వచ్చిన మేనళ్లుడు కార్తీక్‌, మరో వ్యక్తి సాయి అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం తీవ్రంగా గాయపడిన మోహనరావును కారులో నుంచి కిందకు దించి, తలపై కర్రతో కొట్టి హతమార్చి ఢిల్లీశ్వరరావు పరారయ్యాడు.

సీసీ పుటేజీ ఆధారంగా..

మోహనరావు హత్య ఘటనపై ఆయన భార్య పైలా శారద ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి మోహనరావు సన్నిహితులపై ఆరా తీయడంతో పాటు, ఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనకు పాల్పడింది ఢిల్లీశ్వరరావేనని నిర్ధారించి.. విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. గురువారం నిందితుడిని అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించిన జేఆర్‌ పురం సీఐ అవతారం, ఎచ్చెర్ల ఎస్‌ఐ లక్ష్మణరావు, జి.సిగడాం ఎస్‌ఐ సందీప్‌ను అభినందించారు.

0
0 views

Comment