logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రెండు గంటల వ్యవధిలో చేరుకుంటే ఎలా ఉంటుంది?



కర్ణాటకలో సెంట్రల్ రైల్వే అధికారుల సమావేశం

ఈ నెలలో డీపీఆర్ సమర్పించనున్న రైట్స్ లిమిటెడ్



బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రెండు గంటల వ్యవధిలో చేరుకుంటే ఎలా ఉంటుంది? ఇదేదో నిజమైతే బాగుంటుంది కదా అనుకుంటున్నారా! కొన్ని సంవత్సరాల్లోనే ఇది నిజం కాబోతున్నది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండూ మహానగరాలు. ఈ రెండూ ఐటీ, పారిశ్రామిక, ఆర్థిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో పోటీపడుతున్నాయి. రెండు ఆర్థిక నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గడం మూలంగా రూపురేఖలే మారిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) ప్రతిపాదనకు పచ్చజెండా ఊపడంతో సెంట్రల్ రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. ఇది కార్యరూపం దాల్చితే దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక రవాణా ప్రాజెక్టు కానున్నది.



సెంట్రల్ రైల్వే అధికారులు ఇటీవల కర్ణాటక చేరుకుని ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌పై ప్రాథమిక చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రెండు మహా నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా బడ్జెట్‌లో ప్రతిపాదించడం అలా రైల్వే ఉన్నతాధికారులు రంగంలోకి దిగి చర్చలు ప్రారంభించడం చకచకా జరిగిపోతున్నాయి.



బెంగళూరు–చెన్నై మహానగరాలను కలిపే హైస్పీడ్ రైలు కోడిహళ్లి వరకు ప్రతిపాదించారు. ఇదే కాకుండా మెట్రో రైలు నెట్‌వర్క్‌ కూడా కోడిహళ్లి వరకు ఉండటం కలిసివచ్చే అంశంగా ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు నగరానికి తరచూ రాకపోకలు సాగించే వారికి హైస్పీడ్ రైలు ఎంతో సౌలభ్యంగా ఉండననున్నది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవడానికి విమానాశ్రయం వెళ్లడం, అక్కడ గంటల తరబడి వేచి ఉండడం, దిగిన తరువాత గమ్యస్థానం చేరుకోవడానికి మరింత సమయం తీసుకుంటున్నదని బెంగళూరుకు చెందిన కన్సల్టెంట్ శివకుమార్ తెలిపారు. హైస్పీడ్ రైలు ప్రారంభమైతే రెండు గంటల్లో చేరుకోవచ్చని, తిరిగి రాత్రి ఇంటికి చేరుకోవచ్చని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.



కర్ణాటక రాష్ట్ర పరిధిలో ప్రత్యేక రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం 176 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. చోకనహళ్లి, నల్లాల జిల్లాల పరిధిలో అటవీ శాఖ భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించి మార్చి, 2026 లోగా అందచేయాల్సిందిగా కేంద్ర రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది. రైలు ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసు (రైట్స్) లిమిటెడ్ డీపీఆర్ రూపకల్పనలో ఉంది. హైస్పీడ్ రైలు నిర్మాణం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాల్సిందిగా సెంట్రల్ రైల్వే అధికారులు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. నోడల్ అధికారిని నియమిస్తే, ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను సమన్వయం చేసుకుంటారని, పనులు వేగిరంగా పూర్తవుతాయని, పాలనాపరమైన సమస్యలు తలెత్తవని తెలిపారు. కర్ణాటక రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ, హైస్పీడ్ రైలుతో ఈ ప్రాంతం మరింతగా డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోడిహళ్లి కేంద్రంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మహా నగరాలను కలిపే హైస్పీడ్ రైలు వస్తున్నదని, ఈ నెట్‌వర్క్‌ మూలంగా దక్షిణ భారత దేశంలో మూడు రాష్ట్రాల మధ్య పరస్పర సేవల మార్పిడి, ప్రతిభ, పారిశ్రామిక సరకులు రవాణా చేసుకోవడానికి వీలు కలుగుతుందని పాటిల్ వివరించారు.



హైదరాబాద్, బెంగళూరు మహా నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ నిపుణులు ప్రతినిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండనుంది. హైదరాబాద్, బెంగళూరుకు సమీపంలో ఉన్నవారు ప్రతిరోజు రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు ఉండనున్నది. వారాంతాల్లో ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించే సమస్య కూడా తప్పనున్నది.

0
780 views

Comment