ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల TET మినహాయింపు కోసం జాతీయ OBC అధ్యక్షుడు వినతి .
జాతీయ ఓబీసీ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించాలని విన్నవించారు. సుప్రీం కోర్టు ఇటీవలి తీర్పు ప్రకారం ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కొనసాగించాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో, తీర్పు వెలువడే ముందు నియమితులైన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు TET అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన స్పష్టంగా కోరారు. ఈ ఉపాధ్యాయులు తమ నియామక సమయంలో అమలులో ఉన్న నిబంధనలు, అర్హతల ప్రకారం విధుల్లో చేరి, ఎన్నో సంవత్సరాలుగా విద్యా వ్యవస్థకు అమూల్య సేవలందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్నారు.ఇప్పుడు కొత్త TET నిబంధనల వల్ల వీరి దీర్ఘకాలిక అనుభవం, సేవలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. కాబట్టి, ఈ ఉపాధ్యాయుల అప్పటి నియమాలు, సేవా చరిత్రను పరిగణించి వారికి TET మినహాయింపు కల్పించాలని వినమ్ర వినతిపత్రం ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించి అవసర ఉత్తర్వులు జారీ చేయాలని ఆకాంక్షించారు. లేకపోతే ఈ నెల 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన నిర్వహించబోతున్నట్లు హెచ్చరిస్తూ, ప్రభుత్వం త్వరగా స్పందించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ వినతి ద్వారా ఉపాధ్యాయుల సేవలను కాపాడుకోవడమే కాక, విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని పోతల ప్రసాద్ నాయుడు అభిప్రాయపడ్డారు.