అరాచకాలకు వంతెన....పొన్నాడ వంతెనకు ఇరువైపులా అసాంఘిక కార్యకలాపాలు- రాత్రి 9 దాటితే అటుగా వెళ్లడానికే భయం ● గంజాయి బాబుల సరఫరాల అడ్డాగా ...
శ్రీకాకుళం : అభివృద్ధికి చిరునామాగా నిలిచిపోతుందన్న ఉద్దేశంతో నిర్మించిన పొన్నాడ వంతెనను కొందరు మందుబాబులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. నగరంతో అనుసంధానం కోసం కట్టిన ఈ వంతెనను అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇటు శ్రీకాకుళం నగరానికి, అటు ఎచ్చెర్ల మండల పరిధి గ్రామాలకు పొన్నాడ వంతెనే దారి. వంతెనకు ఆవల, ఈవల.. ఎటు చూసినా 3 కిలోమీటర్ల పరిధిలోనే మత్తుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చెందిన వ్యక్తి పొన్నాడ రాజీవ్గారితోటలోని నిర్మానుష్య ప్రాంతంలో హత్యకు గురికావడం తెలిసిందే..
వంతెనకు ఇవతల..
శ్రీకాకుళం నగరం పొన్నాడ వంతెన ఆరంభ శ్రీరామ మందిరం కూడలి నుంచి ఇటువైపుగా కలెక్టర్ బంగ్లా, వాంబేకాలనీ, 80 ఫీట్రోడ్డు, కేపీహెచ్‌బీ, కృష్ణాపార్కు, అఫీషియల్ కాలనీలతో పాటు, అటువైపుగా మంగువారితోట, గూనపాలెం, దమ్మలవీధి తదితర ప్రాంతాల్లో మత్తుబాబుల వీరంగం అధికమైంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం మత్తులో యువకులు నాలుగైదు బ్యాచ్‌లుగా విడిపోయి పేట్రేగిపోతున్నారు. స్పోర్ట్స్ బైక్‌లపై వేగంగా వెళ్తూ భయపెడుతుంటారు. రాత్రి 9 గంటలు దాటిందంటే ఇటుగా రావడానికి ఎవరైనా భయపడతారు. అనేకమార్లు దాడులు సైతం జరిగాయి. ఇటీవల వాంబే కాలనీ రాజీవ్ గృహకల్పలోని ఓ గదిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గదిని కొంతమంది యువకులు అద్దెగా తీసుకుని గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు వాడుతున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వచ్చాయి. పొన్నాడ వంతెన చక్కటి సుందర ప్రదేశం. సాయంత్రం వేళ సేద తీరడానికి అనువుగా ఉంటుంది. అదే ఆసరాగా చేసుకున్న కూటమి ప్రభుత్వం నాయకులు సైతం సమీపంలోనే బార్అండ్ రెస్టారెంట్లు, వైన్షాఫులకు అనుమతులు ఇచ్చారు. బ్రిడ్జికి ఆవల రెండు దాబాలు కూడా ఉన్నాయి. వంతెన అవతలివైపు తోటలను మందుబాబులు అడ్డగా మార్చుకున్నారు. బ్రిడ్జి మీద కెమెరాలు పెట్టడంతో తోటల్లోకి వెళ్లిపోతున్నారు. ఎచ్చెర్ల స్టేషన్ పరిధి గ్రామాలైన పెద్ద కొంగరాం, ముద్దాడ, చిన్నకొంగరాం, వెంకన్నగారిపేట మీదుగా తోటపాలెం మార్గంలోని నీలగిరి, మామిడి, జీడి తోటల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. కొంతమంది కళాశాలల అమ్మాయిలతో సైతం మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వస్తుంటారని స్థానికులంటున్నారు.
కొన్ని ఘటనలు..
●శుక్రవారం ఇదే ప్రాంతంలో హత్య జరిగింది.
●దాదాపు నెలన్నర క్రితం ఆంజనేయస్వామి టెంపుల్ సమీపంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచేశారు.
●బ్రిడ్జి దాటాక పీడీ కన్వన్షన్ హాల్ వెనుక నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఏడాది క్రితం కాల్చారని, అదే కన్వర్షన్ హాల్ సమీప మెకానిక్ షెడ్ పక్కన పొలాల్లో ఆరునెలల క్రితం కొందరు తాగి ఘర్షణ పడి కొంగరాం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మరణానికి కారణమయ్యారని గ్రామస్తులు అప్పట్లో ఆరోపించారు.
●శుక్రవారం హత్య జరిగిన ప్రదేశానికి 100 అడుగుల దూరంలో ఉన్న ఎస్ఎంపురం పీఎసీఎస్ బహుళ ప్రయోజన సౌకర్య గోదాం వెనక వైపు ఓ వ్యక్తి పురుగు మందు తాగేశాడు.
●ఇక్కడికి సమీపంలోనే 2023 ఆగస్టు 15న ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందిందని, ఎక్కడెక్కడో చంపేసి ఇక్కడ పడేస్తుంటారని, ఎక్కడెక్కడివారో ఇక్కడ మత్తులో జోగి హత్యలు, దాడులకు ఎగబడుతున్నారని, ఈ మార్గాల్లో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేయడం గమనార్హం.