ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘హెల్త్ మిషన్ - 100’ ప్రారంభం:జిల్లా కలెక్టర్ రాజర్షిషా*
పత్రికా ప్రకటన
మార్చి 2, 2026_ఆదిలాబాదు:
*
రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా "హెల్త్ మిషన్ - 100" ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో "హెల్త్ మిషన్ - 100" ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి మార్చి 2 నుండి జూన్ 9 వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ మిషన్ మొత్తం నాలుగు దశల్లో అమలవుతుందని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో భాగంగా మార్చి 31 వరకు మాతా శిశు ఆరోగ్యం, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, వృద్ధులకు ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తారు. మార్చి 27 నుండి ప్రారంభమయ్యే రెండవ దశలో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. మూడవ దశలో క్షయ, హెచ్‌ఐవి వంటి అంటువ్యాధుల నియంత్రణతో పాటు ఎండదెబ్బ నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తారు. చివరిగా నాలుగవ దశలో పట్టణ ప్రాంతాల్లోని 145 యూపీహెచ్‌సీలను (UPHCs) 'పాలీ క్లినిక్‌లు'గా మార్చి స్పెషలిస్ట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ముఖ్యంగా, ఈ 100 రోజుల్లో రాష్ట్రంలోని 42 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు 30 రకాల పారామితులతో కూడిన డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తామని, కొత్తగా నిర్మించిన టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వివరించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.