రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వం. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం సొంత పార్టీ జపం.
AIMA న్యూస్. కర్నూలు బ్యూరో. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వంగా అధికారాన్ని నడుపుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతిచోటా ఇది మన కూటమి ప్రభుత్వం అని చెబుతున్నారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. కేవలం
స్థానిక ఎమ్మెల్యేలు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో, అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో ఎక్కడా కూటమి అనే పదాన్ని మాట్లాడకపోవడం అక్కడికి విచ్చేసిన కూటమి కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. కేవలం టీడీపీ ప్రభుత్వం అంటూ పదే పదే ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలోనూ మిత్రపక్షాల ప్రస్తావన లేకుండా, క్రెడిట్ మొత్తం తన సొంత పార్టీ ఖాతాలోకి వేసుకునేలా ఎమ్మెల్యేలు మాట్లాడడం. పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల సమయంలో కూటమి విజయానికి జనసేన, బీజేపీ శ్రేణులు కూడా శక్తివంచన లేకుండా కృషి చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక, కనీసం మాట వరుసకైనా వారిని పలు అభివృద్ధి కార్యక్రమాలకు పిలవకపోవడం ఆయా పార్టీల స్థానిక కోఆర్డినేటర్లు లోలోపల మదనపడుతున్నారు. గెలిచాక మిత్రధర్మాన్ని మర్చిపోతే ఎలా? అన్న ప్రశ్నలు క్షేత్రస్థాయిలో తలెత్తుతున్నాయి.
ఇది కేవలం అలవాటులో పొరపాటా? లేక. వాళ్ల నియోజకవర్గాల్లో పట్టును నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేలు చేస్తున్న రాజకీయ వ్యూహమా? అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, రాష్ట్ర స్థాయిలో కూటమి ఐక్యత చాటుతుంటే, పలు ప్రాంతాల్లో మాత్రం సింగిల్ పార్టీ షో నడుస్తోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.