రోలుగుంటలో పాడి రైతులకు పశు విజ్ఞాన సదస్సు, లేగ దూడల పోటీలు
రోలుగుంట మండలం, రోలుగుంట సంతబయల్లో పాడి రైతుల కోసం పశు విజ్ఞాన సదస్సు, లేగ దూడల మెగా ప్రదర్శన, పశు ఆరోగ్య శిబిరం మొదలైన కార్యక్రమాలు మంగళవారం (03.03.2026) ఉదయం 9 గంటల నుంచి జరగనున్నాయి. పాడి రైతుల సలహా సంఘం (రోలుగుంట), పశు సంవర్ధక శాఖ (అనకాపల్లి జిల్లా), పశుగణాభివృద్ధి సంస్థ (ఉమ్మడి విశాఖ జిల్లా), పశుగ్రాస ఉత్పత్తి సంఘం (కశింకోట), వ్యవసాయ మార్కెట్ కమిటీ (చోడవరం), విజయ విశాఖ సహకార డైరీ మెడికల్ షాప్స్, అభ్యుదయ పాడిరైతులు, రోలుగుంట మండల పెద్దలు కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.లేగ దూడల మెగా ప్రదర్శనలో 10 రోజుల నుంచి 10 నెలల వయస్సు గల ఆడ పెయ్యలు (లింగ నిర్ధారిత వీర్యం ద్వారా పుట్టినవి) ప్రదర్శించబడతాయి. జాతి అనుగుణ లక్షణాలు, వయసుకు తగిన బరువు, ఆరోగ్య సూచికల ఆధారంగా నిపుణులైన జడ్జీలు పెయ్యల పోటీలలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తారు. ప్రాథమిక కిట్‌లు ఉచితంగా పంపిణీ చేస్తారు.పశు ఆరోగ్య శిబిరంలో ఉచిత గర్భకోశ పరీక్షలు, తక్షణ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, బలవర్ధకాలు అందించబడతాయి. అనుభవజ్ఞులైన పశు వైద్యులచే ఉచిత వైద్యం లభిస్తుంది. వ్యాధిగ్రస్త ఆవులు, గేదెలు, గొర్రెలు, గొడ్డుమోతు పశువులను తీసుకురావాలని సూచించారు.పశు విజ్ఞాన సదస్సులో ఆధునిక యాజమాన్య పద్ధతులు, శాస్త్రీయ పశు పోషణపై వివరణలు, రైతులతో ఇష్టాగోష్టి, సందేహ నివృత్తి జరుగుతాయి. ప్రభుత్వ పథకాల ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేసి రాయితీలు, పథకాలపై అవగాహన కల్పిస్తారు. ఆధునిక, శాస్త్రీయ పశుపోషణపై జ్ఞానం, ఉచిత వైద్య సేవలు, ఉత్తమ రైతులకు బహుమతులు ద్వారా పశుపోషణను అభివృద్ధి చేసి కుటుంబ జీవనోపాధిని సాధించాలని నిర్వాహకులు రైతులందరినీ పాల్గొనమని విజ్ఞప్తి చేశారు.