logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీకాకుళం లో హత్య కేసులో పోలీసుల అదుపులో అనుమానితులు?

శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని పొన్నాడ వంతెన సమీప వెంకన్నగారిపేట రాజీవ్‌గారి తోటలో గురువారం జరిగిన హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఎచ్చెర్ల పరిధిలో ఈ హత్య జరగడంతో విచారణాధికారిగా జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం సమక్షంలోని ఓ బృందంతో పాటు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో మరో రెండు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే హత్యకు గురైన పైలా మోహన్‌ చిట్టీల వ్యాపారం చేస్తుంటాడని, ఆ వ్యాపార లావాదేవీల్లో జరిగిన తేడా వలనే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో ఇప్పటికే ఇద్దరి అనుమానితులను కాల్‌డేటా, సీసీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో ఒకరిది విశాఖపట్నం కాగా, మరొకరు నగరానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

కారులో నలుగురొచ్చారా..?

హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న వైన్‌షాపులో నిందితులు మద్యం బాటిళ్లను కొనుగోలు చేశారని, శుక్రవారం రాత్రే నిర్ధారణకొచ్చిన పోలీసుల అక్కడి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. దాబాలు, బ్రిడ్జివైపు ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. హత్యకు గురైన మోహన్‌, ఇంటి నుంచి బయల్దేరిన సమయంలో ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారన్నది కాల్‌డేటా తీయడం.. అప్పటికే పరిశీలించిన సీసీ ఫుటేజీలో కారులో నలుగురు వ్యక్తులు రావడం, వారితో కలిసి మోహన్‌ వెళ్లడం పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ముందుగా వైన్‌షాపులో మద్యం బాటిళ్లు కొని, తర్వాత సమీప దాబాలో ఫుడ్‌ కట్టించుకుని తోటలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తి హిజ్రాల సంఘానికి జిల్లా నాయకునిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు వారిలో పోలీసులకు పట్టుబడిన విశాఖ వ్యక్తే ఇక్కడికొచ్చి పార్టీలిస్తున్నట్లు స్థానికంగా అనుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీల్లో తేడా కారణంతోనే తుదముట్టించారన్న దిశగానే పోలీసుల దర్యాప్తు సాగుతుందన్నది విశ్వసనీయ సమాచారం.

ఘటనా స్థలం పరిశీలన

ఎచ్చెర్ల: పైల మోహన్‌ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని డీఎస్పీ వివేకానంద శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. ఆయనతోపాటు ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు ఉన్నారు.

1
14 views

Comment