ఉపాధికి కొత్తరూపు.
శ్రీకాకుళం: గ్రామాల్లో వలసల నివారణకు ఇదివరకు ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపురేఖలు మారనున్నాయి.ఈ చట్టంలో పలు మార్పులు తీసుకు రావడంతో పాటు పథకం పేరును మారుస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను వీబీ-జీ రామ్-జీ పథకంగా (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్-గ్రామీణ్) పేరును మార్పు చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇక ఈ పథకం ద్వారా వచ్చే నిధుల శాతం కూడా మారనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉపాధి హామీ చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ నూతన చట్టానికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఏడాదికి 125 రోజుల పనిదినాలు
కొత్తగా వస్తున్న వీబీ-జీ రామ్-జీ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు కల్పించనున్నారు. గతంలో ఏడాదికి 100 పని దినాలు ఉండేవి. వాటికి అదనంగా 25 రోజులు పెంచారు. ఇక రోజువారీ వేతనం రూ.311ల వరకు అందించనున్నారు. గతంలో పని అడిగితే జాబ్ కార్డు ఉన్న వారందరికీ పని కల్పించేవారు. జాబ్ కార్డు లేని కుటుంబాలకు జాబ్ కార్డును కూడా అందజేసేవారు. ఎంత పనినైనా చేసే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుత నూతన చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీల్లో కూలీల ఆధారంగా బడ్జెట్ కేటాంచనున్నారు. నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే 15 రోజుల్లో కూలీలకు నిరుద్యోగ భృతి అందించే విధంగా చట్టంలో మార్పులను చేశారు. ఎక్కువ రోజులు పనిచేసేందుకు అవకాశం లేదు. ముందుగా నిర్ణయించిన మేరకే పనులు చేయాల్సి ఉంటుంది.
పనికి హాజరైతేనే వేతనాలు
కొత్త చట్టంలో నూతన సాంకేతిక విధానంతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. కూలీల బయోమెట్రిక్, జియో ట్యాగింగ్, రియల్ టైం డాష్ బోర్డులతో సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ ఉంటుంది. ఈ సాంకేతిక విధానంలో దొంగ మస్తర్లకు కాలం చెల్లినట్టే. పని చేస్తున్న ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. అక్కడికి వెళ్లి కూలీలు బయోమెట్రిక్ వేస్తేనే హాజరు నమోదు అవుతుంది. దీంతో పాటు ఫొటో, పని ముగిసిన వెంటనే మరోసారి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పనులకు వస్తేనే వేతనం అందించే విధంగా మార్పులు చేపట్టారు.
10 రోజుల్లోనే వేతనాలు
కొత్తచట్టంలో పనులకు హాజరయ్యే కూలీలకు 10 రోజుల్లోనే వేతనాలు ఖాతాలకు జమ చేస్తారు. పనులకు హాజరైన వెంటనే వారి వివరాలు వీబీ-జీ రామ్-జీ నూతన యాప్‌లో నమోదవుతాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం 60 శాతం మేర నిధులను కేటాయించే విధంగా చట్టంలో మార్పులు చేశారు. రాష్ట్ర వాటా చెల్లిస్తేనే కేంద్రం వాటా నిధులు విడుదల చేస్తారు. అలాగే పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాలి, లేకుంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఏప్రిల్ నుంచి అమల్లోకి...
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉపాధి చట్టం వీబీ-జీ రామ్-జీ అమల్లోకి రానుంది. పెంచిన పనిదినాలతో జిల్లావ్యాప్తంగా 5 లక్షల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సకాలంలో చెల్లించే అవకాశం ఉండదని, దీని వలన పని దినాలు ఉన్నా, పనికి వేతనం అందించడంలో ఇబ్బందులు వస్తాయని ప్రజా సంఘాలు, రైతుల కూలీ సంఘాలు ఈ కొత్త చట్టంపై విమర్శలు చేస్తున్నాయి.
నేటి నుంచి అవగాహన సదస్సులు
నూతన ఉపాధి చట్టం ప్రకారం జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ బి.లవరాజు తెలిపారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఆరు వారాల పాటు 'జన్-సంవాద్' పేరుతో క్షేత్రస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వారాల వారీగా కార్యాచరణ
మొదటి వారం: మీడియా సమావేశాల ద్వారా అపోహల తొలగింపు. కొత్త చట్టం విశిష్టతపై కరపత్రాల పంపిణీ.
రెండో వారం: గ్రామాల్లో 'హక్కుల రక్షణ ప్రతిజ్ఞ' కార్యక్రమాలు.
మూడో వారం: గ్రామసభల్లో రచ్చబండ కార్యక్రమాలు, గోడ పత్రికల ద్వారా ప్రచారం.
నాలుగో వారం: పాఠశాల విద్యార్థులకు పోటీ లు, గాంధీజీ సూక్తులతో అవగాహన ర్యాలీలు.
ఐదో వారం: పంచాయతీరాజ్ ప్రతినిధులతో సదస్సులు.
ఆరో వారం: కనీసం 100 రోజుల పని పూర్తి చేసిన శ్రామికులకు సన్మానం.
పేరు మార్పుచేస్తూ కొత్తచట్టం
ఇక నుంచి 125 పనిదినాలు
మారనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల శాతం
కొత్తచట్టంపై పలువురి విమర్శలు