ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
-జాతీయ సైన్స్ (విజ్ఞానశాస్త్ర) దినోత్సవము..........
తేదీ: 28-02-2026, శేర్లింగంపల్లి చందానగర్:ఈరోజు మధ్యాహ్నము BHEL టైన్ షిప్ లో గల శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోబెల్, భారతరత్న బహుమతుల గ్రహీత సర్ C.V. రామన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ A. కవితగారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ భౌతికశాస్త్ర ఆచార్యులు G. వెంకటయ్య గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ "జాతీయ సైన్స్ దినోత్సవాన్ని భారతదేశం అంతటా పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధన సంస్థలలో 1987 నుండి ప్రతి సంవత్సరము ఒక నినాదంతో నిర్వహించుకుంటున్నాము" అని అన్నారు. "ఈ సంవత్సరపు ' _విజ్ఞానశాస్త్రంలో ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం'_అనే నినాదంతో నిర్వహిస్తున్నాము" అని తెలిపారు. "ఈరోజే నిర్వహించడానికి గల కారణం రామన్ గారి తన పరిశోధన అయినటువంటి కాంతి ఒక పదార్థంపై పడినపుడు ఆ పదార్థంలోని అణువులతో పరస్పర చర్యలవల్ల కాంతి తరంగ ధైర్యంలో జరిగే మార్పు. ఈ మార్పు ఆధారంగా శాస్త్రవేత్తలు ఆ పదార్థం యొక్క రసాయన నిర్మాణం మరియు లక్షణాలను తెలుసుకోవచ్చు అని తెలిపారు. ఈ సూత్రము ఆధారంగా అభివృద్ధి చెందిన రామన్ స్పెక్ట్రోస్కోపీ పద్ధతి, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, నానో టెక్నాలజీ మరియు ఫార్మాస్యూటికల్ పరిశోధనలలో విస్తృతంగా ఉపయోగ పడుతుంది" అని తెలిపారు. "ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో శాస్త్రీయ అవగాహన పెంపొందించడం, యువతను శాస్త్ర సాంకేతిక రంగాలలో కెరీర్ల వైపు ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథం మరియు హేతుబద్ధమైన ఆలోచనలను అభివృద్ధి చేయడం మరియు భారతదేశం యొక్క శాస్త్రీయ పురోగతిని ప్రజలకు పరిచయం చేయడం లాంటివి" అని అన్నారు. ఈ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లను, వర్క్ షాపులను మరియు ఉపన్యాసాలను, క్విజ్ పోటీలను, శాస్త్రీయ ప్రదర్శనలను నిర్వహించడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి" అని తెలిపారు.
"సర్ CV రామన్ గారు గొప్ప భౌతికశాస్త్ర వేత్త. కాంతి పరిక్షేపంపై ఆయన చేసిన పరిశోధలకు 1930లో నోబెల్ బహుమతిని పొందారు. ఈ విభాగంలో నోబెల్ బహుమతిని పొందిన వారిలో ఆశియాలోనే మొదటి భౌతికశాస్త్రవేత్త" అని అన్నారు. "ఆయన చిన్నతనం నుండి తెలివైన విద్యార్థి. భౌతికశాస్త్రం పట్ల మక్కువ చూపేవారు. ఆయన మెట్రిక్యులేషన్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. M. Sc ఫిజిక్స్ లో విశ్వవిద్యాలయంలోనే మొదటి వ్యక్తిగా నిలిచాడు. వారు లండన్ లో కూడా అనేక పరిశోధనలు నిర్వహించారు. ఆయన కేవలం 200 రూపాయల విలువైన పరికరాలతో అంతర్జాతీయ స్థాయి ప్రయోగాన్ని ఆవిష్కరించి నోబెల్ బహుమతి అందుకున్న గొప్ప భౌతికశాస్త్రవేత్త" అని కొనియాడారు. రామన్ గారు I C S ఆఫీసరుగా, ఆచార్యునిగా, డైరక్టర్ గా సేవలను అందించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో తొలి భారతీయ డైరక్టర్ గా సేవలందించారు. ఆయన జీవితాంతం పరిశోధనలతోనే కాలం గడిపేవారు. ఆయన బెంగళూరులో C V రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించి రీసెర్చ్ కార్యక్రమాలకు పెద్దపీట వేయడం జరిగింది. అది నేటికి కూడా పరిశోధనలతో విరాజిల్లుతూ కొనసాగుతుంది" అని అన్నారు. "శాస్త్ర, సాంకేతిక రంగాలు సమాజాభివృద్ధికి కీలకమైనవి. శాస్త్ర, సాంకేతిక రంగాలలో పురోభివృద్ధి సాధించినప్పుడే మనం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పూర్వము కంటే అధికంగా నిధులను కేటాయించి పరిశోధన రంగానికి పెద్దపీట వేయాలి" అని కోరారు. "సైన్స్ అనేది ప్రజలకోసం, ప్రగతి కోసం. గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ పట్ల అవగాహన లేక నిరక్షరాస్యతతో, మూఢనమ్మకాలతో మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, బాణామతి లాంటి వాటి వలన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వంటి వాటికి గురి అవుతున్నారు. వీటి నివారణకైన అందరికి సైన్స్ పట్ల అవగాహన పెంచడమే ఏకైక పరిష్కార మార్గము" అని అన్నారు.
"నేటి విద్యార్థులు CV రామన్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని ఉన్నత విద్యలో సైన్స్ విద్యను అభ్యసించి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవ చేయాలి. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి" అని అన్నారు. "CV "రామన్ గారు సైన్స్ రంగానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న బిరుదులతో సత్కరించడంతో పాటు ఆయన గౌరవార్ధం ఆయన పరిశోధన ఆవిష్కరించిన రోజైన ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ డే గా నిర్వహిస్తున్నారు" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్య ప్రకాష్ , సైన్స్ అధ్యాపకులు డాక్టర్ అనురాధ, జ్యోతిర్మయి, మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.