ప్రతి 20 నిమిషాలకో బస్సు అహోబిలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ఆళ్లగడ్డ డిపో
AIMA న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం అహోబిలం క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, భక్తుల సౌకర్యార్థం ఆళ్లగడ్డ బస్సు డిపో నుండి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు శనివారం రోజున డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అహోబిలం బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రధాన రోజులలో 28 నుండి 5వ తేదీ వరకు ఆళ్లగడ్డ బస్టాండ్ నుండి అహోబిలంకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.రద్దీకి అనుగుణంగా అదనంగా ప్రత్యేక బస్సులను కేటాయించడం జరిగింది. ఇవి తెల్లవారుజాము నుండే భక్తులకు అందుబాటులో ఉంటాయి. భక్తుల అవసరార్థం దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలంకు కూడా షటిల్ సర్వీసులను సమన్వయం చేస్తున్నాము.భక్తులకు మార్గదర్శకత్వం వహించడానికి, క్యూ లైన్లను పర్యవేక్షించడానికి ఆళ్లగడ్డ మరియు అహోబిలం పాయింట్ల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ సూపర్‌వైజర్లను, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాము. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురికాకుండా, అనుభవజ్ఞులైన డ్రైవర్లు నడిపే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా స్వామివారిని దర్శించుకోవాలని,బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిపో యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది.కావున భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరారు