📰 పత్రికా స్వేచ్ఛపై దాడి...
విలేకరిపై బర్తిపూర్ విడిసి సభ్యుల బెదిరింపులు...
మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 28/02/2026:
జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం బర్తిపూర్ గ్రామంలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రభ పత్రికకు మెట్‌పల్లి ప్రాంతంలో పనిచేస్తున్న విలేకరి మ్యాకల శివపై గ్రామ విడిసి సభ్యులు బెదిరింపులకు దిగిన ఘటన చర్చనీయాంశమైంది.
🔎 అసలేం జరిగింది?
గ్రామంలో ఉన్న ఒక ‘బాబా’కు సంబంధించిన అంశంపై విలేకరి శివ ఒక వార్త ప్రచురించారు. ఆ వార్తపై అభ్యంతరం వ్యక్తం చేసిన విడిసి సభ్యులు, శివను నిలదీసి —
“బాబా గురించి వార్త ఎందుకు రాశావు..?”
“నీకు ఆ విషయం ఎవరు చెప్పారు..?”
“సమాచారం ఇచ్చిన వారి పేరు చెప్పాల్సిందే..!”
అంటూ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.
⚠️ గోప్యత హక్కుపై ఒత్తిడి
వార్తా సేకరణలో భాగంగా సమాచార దాతల గోప్యతను కాపాడటం జర్నలిస్టుల బాధ్యత. అలాంటి సందర్భంలో ఇన్ఫార్మర్ వివరాలు వెల్లడించాలంటూ బెదిరించడం పత్రికా విలువలకు వ్యతిరేకమని స్థానిక జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“వార్తలు రాస్తే బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్యానికి ముప్పు” అంటూ జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.
🗣️ జర్నలిస్టు సంఘాల డిమాండ్
భర్తీపూర్ విడిసి సభ్యుల ఆగడాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని వారు కోరుతున్నారు.