రోలుగుంట మండలం వి.బి.జి.రామ్‌జీ పథకంతో గ్రామీణ అభివృద్ధి వేగవంతం.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఈజీఎస్) ద్వారా విస్తృత అభివృద్ధి కొనసాగుతోంది. ఈ పథక ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లకుండా స్వంత ప్రాంతంలోనే పని కల్పించడం. సగటున రూ.307 వరకు వేతనం, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 పని దినాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పశువుల షెడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, సీసీ రోడ్లు, హార్టీకల్చర్ వంటి పనుల ద్వారా వ్యక్తిగత, సామాజిక ఆస్తులు సృష్టిస్తున్నారు.మండలంలో హార్టీకల్చర్ ద్వారా 162 మంది రైతులకు 187 ఎకరాల్లో రూ.52.36 లక్షలు లబ్ధి చేకూర్చారు. 2024-25, 2025-26 సంవత్సరాలకు 109 మంది రైతులకు 109 పశువుల షెడ్లకు రూ.138.75 లక్షలు మంజూరయ్యాయి. భూగర్భ జలాల అభివృద్ధికి 360 ఫారం పాండ్‌లు నిర్మించి 300 ఎకరాలకు రూ.180 లక్షలతో ప్రయోజనం కల్పించారు. 16 గ్రామ సచివాలయాలకు రూ.690 లక్షలు, 16 రైతు సేవా కేంద్రాలకు రూ.240 లక్షలు, 12 విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు రూ.148 లక్షలు కేటాయించారు.గిరిజన గ్రామాల్లో రహదారులు లేని ప్రాంతాల్లో మూడు బీటీ రోడ్లకు రూ.350 లక్షలు ఖర్చు చేశారు. 2025-26 సంవత్సరంలో 82 సీసీ రోడ్లకు రూ.438.50 లక్షలు మంజూరై, ఫిబ్రవరి 5నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ పథకం పేరు ‘వి.బి.జి.రామ్‌జీ పథకం’గా మారుతూ, ప్రతి కుటుంబానికి సగటున 125 పని దినాలు కల్పించనున్నారు.ఫిబ్రవరి 27 నుంచి మార్చి 30, 2026 వరకు అన్ని గ్రామ పంచాయితీ, మండల స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వరరావు, రోలుగుంట మండల ఏ పీ వో ఈశ్వరరావు, ఏ వో లక్ష్మి, పాల్గొన్నారు. ఈ చర్యలు గ్రామీణ ఆర్థిక బలోపేతానికి, మౌలిక సదుపాయాల పెరుగుదలకు దోహదపడతాయి అని వారు తెలిపారు.