మార్చి 4న చలో విజయవాడ.. జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ (ఎపిబిజెఏ) సంయుక్తంగా మార్చి 4న 'చలో విజయవాడ' కార్యక్రమం తలపెడుతున్నాయి.ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టుల ప్రదర్శన, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ నిర్వహిస్తారు. ఈ సభలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పాల్గొంటారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఇంటిస్థలాలు కేటాయించాలి, ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేయాలని ఈశ్వరరావు డిమాండ్ చేశారు.