ఆళ్లగడ్డలోని కందుకూరు రోడ్డుపై అధికారుల నిర్లక్ష్యం ఎవరి కోసం?
AIMA న్యూస్ బ్యూరో నంద్యాల జిల్లా.ఆళ్లగడ్డ పట్టణంలో పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నా, కందుకూరు రోడ్డు పరిస్థితి మాత్రం అధ్వానంగా మారింది. పట్టణంలోని దాదాపు అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తవుతుండగా, కేవలం ఈ ప్రాంతంపైనే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు పక్షపాతం చూపుతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు మార్గంలో రెండు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలు, దర్బార్ టీ స్టాల్, బిబిఆర్ స్టేడియం, షాది ఖాన్ ఉన్నాయి. నిత్యం వందలాది మంది ప్రజలు, విద్యార్థులు స్కూల్ బస్సులు, ఆటోలు మరియు బైకులపై ఈ దారి గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఉండటంతో వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతమైన దుమ్ము లేస్తోంది. వీటి కారణంగా విద్యార్థులు శ్వాసకోస వ్యాధులు, కళ్ల అలర్జీలతో ఇబ్బంది పడుతున్నారు.చిన్న పిల్లల యూనిఫాంలు, బ్యాగులు నిమిషాల్లో దుమ్ముతోనిండిపోతున్నాయి.గుంతలమయంగా ఉన్న రోడ్డుపై బైకులు జారి పడి ఇప్పటికే పలువురు ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు గాయపడ్డారు. ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గం వారికి సంబంధించిన స్థలాలు ఉన్నాయనే సాకుతోనే రోడ్డు వేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏమంటే ఈ వార్డు ప్రజల ఓట్లే స్థానిక ఎమ్మెల్యే గెలుపుకు ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. రాజకీయాలు ఎన్నికల సమయంలో చూసుకోవాలి, కానీ ప్రజల సౌకర్యాలు, ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఇలాంటి వివక్ష చూపడం తగదు. వర్షాకాలం ఈ రోడ్డు బురదమయంగా మారి నడవడానికి వీలు లేకుండా జరిగింది. ఇప్పుడు ఎండాకాలంలో దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రాజకీయాలకు తావు లేకుండా కందుకూరు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.