logo

రేగుంటలో వివోఏ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు... - మహిళా సంఘాల భారీ మద్దతుతో ఎనుగుర్తి సరిత విజయం – రెండు సంవత్సరాల పోరాటానికి ఫలితం..

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) ఫిబ్రవరి 19, 2026:

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం పరిధిలోని రేగుంట గ్రామంలో నిర్వహించిన వివోఏ (V.O.A) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గ్రామపంచాయతీ ఆవరణలో మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో ఓటింగ్ నిర్వహించగా, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
2 సంవత్సరాల క్రితం ఉద్యోగం నుంచి తొలగించబడిన ఎనుగుర్తి సరిత తిరిగి అవకాశాన్ని కోరుతూ పోటీ చేయగా, తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న మరో మహిళ కూడా బరిలో నిలిచారు. ప్రారంభంలో కొంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, గ్రామ సచివాలయ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగింది.
ఓట్ల లెక్కింపులో ఎనుగుర్తి సరితకు అత్యధిక మద్దతు లభించింది. మహిళా సంఘాల సభ్యుల అధిక ఓట్లతో ఆమె విజేతగా నిలిచారు. విజయం అనంతరం మహిళా సంఘ సభ్యులు సరితకు అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని సరిత హామీ ఇచ్చారు.
గత ఆరు సంవత్సరాలుగా మహిళా సంఘాలకు బ్యాంకు లావాదేవీలు, సమావేశాలు సక్రమంగా జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివోఏ పదవి ఖాళీగా ఉండటం వల్ల ప్రభుత్వ రాయితీలు, ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయని తెలిపారు. కొందరు రాజకీయ నాయకుల జోక్యంతోనే సరితను దూరం పెట్టారని మహిళా సంఘ సభ్యులు ఆరోపించారు.
పిడి ఆఫీస్ నుంచి జాయినింగ్ ఆర్డర్ వచ్చినప్పటికీ, అది రద్దు చేయించి మరొకరిని నియమించేందుకు ప్రయత్నించారని సరిత ఆరోపించారు. దీనికి నిరసనగా గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద 17 రోజుల పాటు మౌన దీక్ష చేపట్టారు. జిల్లా స్థాయి బీసీ, మహిళా సంఘాలు ఆమెకు మద్దతు ప్రకటించాయి. సర్పంచ్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆమె దీక్షను విరమించారు.
ఈ ఎన్నికల ప్రక్రియ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో నిర్వహించబడింది. ఓటింగ్ ఫలితంతో అధికారులు స్పందించి సరితను తిరిగి వివోఏగా నియమిస్తారా అనే దానిపై గ్రామంలో ఆసక్తి నెలకొంది.
గత 15–20 సంవత్సరాలుగా మహిళా సంఘాలకు సేవలందించిన సరితకు న్యాయం జరిగిందని మహిళా సంఘాల సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అధికారుల నిర్ణయం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.

1
401 views
1 comment