logo

రేగుంట గ్రామంలో వీవోఏ ఎన్నికలపై ఉద్రిక్త పరిస్థితులు..

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 19/02/2026:
జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, రేగుంట గ్రామం:
రేగుంట గ్రామపంచాయతీ పరిధిలో వీవోఏ (Village Organization Assistant) ఎన్నికల నిర్వహణ అంశం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో మహిళా సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలని, ఆలస్యం చేయకుండా వెంటనే నిర్వహించాలని కొందరు మహిళలు డిమాండ్ చేశారు. “నియమావళి ప్రకారం ఎన్నికలు జరగాలి. ఎవరి ఒత్తిడికీ లోనుకాకుండా పారదర్శకంగా నిర్వహించాలి” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, మరికొందరు వ్యక్తులు ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు ఈ వ్యవహారంలో అధికారులు జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
పరిస్థితిని గమనించిన అధికారులు శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
రేగుంట గ్రామంలో వీవోఏ ఎన్నికల అంశం ఎలా మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

44
2162 views