logo

వర్శిటీల్లో సౌకర్యాలు.. పరిశోధనలకు ప్రోత్సాహం ఎక్కడ?.....

కాపీ కొట్టే మేధస్సు – భారత్‌ నిండా గల్గోటియా వర్శిటీలే!

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన చైనా రోబో ఉదంతం అంతర్జాతీయంగా భారత్‌ను చులకన చేసింది. అయితే కేవలం ఒక విద్యాసంస్థకు సంబంధించిన అతి తెలివి మాత్రమే కాదు.. అది దేశ విద్యా వ్యవస్థలో వేళ్లూనుకున్న డొల్లతనానికి నిదర్శనం. ఒక విదేశీ ఉత్పత్తిని తెచ్చి, దానికి తమ బ్రాండింగ్ తగిలించి, వందల కోట్ల పరిశోధనగా ప్రపంచానికి చెప్పుకోవడం ద్వారా ఆ సంస్థ భారత్ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పణంగా పెట్టింది. ఈ ఘటనను కేవలం ఒక యూనివర్సిటీకే పరిమితం చేసి చూడటం వల్ల అసలు సమస్య పక్కదారి పట్టే ప్రమాదం ఉంది.

అన్ని యూనివర్శిటీల్లోనూ కాపీ పేస్ట్ వ్యవహారమే!

భారత్‌లో నేడు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనేక ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు గల్గోటియా కు సిస్టర్ కన్సర్న్‌లాగే కనిపిస్తాయి. వీటి ప్రధాన లక్ష్యం విద్యార్థుల మేధస్సును పదును పెట్టడం కంటే, వారి నుండి భారీగా ఫీజులు వసూలు చేయడంపైనే ఉంది. అడ్వర్టైజ్‌మెంట్లలో ఆడంబరమైన భవనాలను, ఏసీ రూములను చూపించి ఆకర్షించే ఈ సంస్థలు.. విద్యార్థులలో పరిశోధనల పట్ల కనీస ఆసక్తిని కలిగించలేకపోతున్నాయి. ఇన్నోవేషన్ అంటే ఏదో ఒక విదేశీ వస్తువును తీసుకొచ్చి కాపీ కొట్టడమో, లేదా ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని దొంగిలించి ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేయడమో అనే స్థాయికి విద్యార్థులను పరిమితం చేస్తున్నాయి.

వర్శిటీల్లో సౌకర్యాలు.. పరిశోధనలకు ప్రోత్సాహం ఎక్కడ?

మన దేశంలో వనరులు, ప్రతిభకు కొదవ లేదు. కానీ, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వాతావరణం మన విద్యాసంస్థల్లో లేదు. ఏఐ , క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో అద్భుతాలు చేయగల సత్తా ఉన్న విద్యార్థులు.. ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు, పరిశోధనా వనరులు లేక విదేశాలకు వలస పోతున్నారు. భారత్ నుంచి వెళ్ళిన వారే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సీఈఓలుగా పని చేస్తున్నారు. కానీ, అదే మేధస్సు స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కాపీ వేషాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది.

సమగ్రంగా మారాల్సింది విద్యా వ్యవస్థే

గల్గోటియాస్ వంటి సంస్థలను కేవలం ట్రోల్ చేయడమో లేదా సోషల్ మీడియాలో విమర్శించడమో చేస్తే వ్యవస్థలో మార్పు రాదు. ప్రభుత్వం కేవలం ఒక యూనివర్సిటీని బ్యాన్ చేస్తే సరిపోదు.. అసలు ఇలాంటి దారుణమైన అబద్ధాలను అంతర్జాతీయ వేదికల వరకు తీసుకెళ్లే ధైర్యం వారికి ఎలా వచ్చిందనేది ఆలోచించాలి. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చేటప్పుడు , వాటి ర్యాంకింగ్ నిర్ణయించేటప్పుడు కేవలం అకడమిక్ రికార్డులే కాకుండా, వారు చేస్తున్న అసలైన పరిశోధనలు ఏమిటి? వారు విద్యార్థులకు కల్పిస్తున్న ల్యాబ్ సౌకర్యాలు ఏమిటి? అనే అంశాలపై కఠినమైన ఆడిటింగ్ జరగాలి. విద్యా వ్యవస్థలో మార్పు అనేది మార్కుల వేట నుంచి మౌలిక ఆవిష్కరణల వైపు మళ్లాలి. విద్యార్థులను కేవలం ఉద్యోగులుగా కాకుండా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దే బాధ్యతను యూనివర్సిటీలు తీసుకోవాలి. లేనిపక్షంలో, ప్రపంచ వేదికలపై ఇలాంటి కాపీ ఉత్పత్తులతో నవ్వుల పాలు కావడం మనకు పరిపాటిగా మారిపోతుంది.

0
0 views