logo

రమేష్ హత్యపై సీఎం మౌనం వెనుక మర్మమేంటి?*......

​ *చంద్రబాబు పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణేది? రమేష్ హత్యపై సీఎం మౌనం వెనుక మర్మమేంటి?* వేదిక: ధర్నా చౌక్, విజయవాడ.

విజయవాడ: *రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దళితుల రక్షణను గాలికి వదిలేసిందని MRPS మరియు అన్ని మాదిగ సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద AP MRPS అధ్యక్షులు శ్రీ దాసరి సువర్ణ రాజు మాదిగ, MRPSS అధ్యక్షులు శ్రీ బొంగా బుంగా సంజయ్ మాదిగ గారి అధ్యక్షతన నిర్వహించిన భారీ ధర్నాలో వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు, AP MRPS అధ్యక్షులు పేరిపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రభుత్వ వివక్షను తీవ్రంగా ఎండగట్టారు.*

మాదిగ నాయకులు మాట్లాడుతూ...దళితుల ప్రాణాలకు విలువ లేదా?: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితుల మీద దాడులు నిత్యకృత్యమయ్యాయి. T M రమేష్ మాదిగ అనే దళిత నాయకుడిని దారుణంగా హత్య చేస్తే, ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటు. ఒక అగ్రవర్ణ సామాజిక వర్గం (కాపు) వ్యక్తి చనిపోతే గంటల్లో స్పందించి కోట్లాది రూపాయల పరిహారం ప్రకటించే ప్రభుత్వం, దళితుడు చనిపోతే ఎందుకు నోరు మెదపడం లేదు? చనిపోయిన వారిలో కూడా కులాలు చూస్తూ, శవాల మీద రాజకీయాలు చేస్తారా? దళితులకు ఒక రేటు, అగ్రవర్ణాలకు ఒక రేటా? అని నిలదీశారు.బాధితుడు రమేష్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 1 కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ఈ కేసును విచారించడానికి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి హంతకులకు కఠినమైన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు పదవుల కోసం జాతి మనుగడను మంట కలుపుతారా, అంబేడ్కర్ గారు పెట్టిన భిక్షతో పదవులు అనుభవిస్తున్న దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు తమ జాతి మీద దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మీ కుర్చీల కోసం దళిత జాతి ప్రయోజనాలను తాకట్టు పెడతారా? మీరు దళిత ప్రజా ప్రతినిధులు దళితుల పక్షాన నిలబడండి అని ఘాటుగా విమర్శించారు.హోం మంత్రి అనితమ్మ గారు కూడా ఒక దళిత మహిళేనని గుర్తు చేస్తూ.. మీ కళ్ల ముందే మన జాతికి అన్యాయం జరుగుతుంటే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని ,శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడకుంటే పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్తామని, ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన అన్ని మాదిగ సంఘాల ముఖ్య నాయకులతో రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజున కూటమి ప్రభుత్వం దిగివచ్చేలా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

0
0 views