
పత్రికా ప్రకటన
ఫిబ్రవరి 18, 2026- ఆదిలాబాద్
*సంత్ సేవాలాల్ మార్గంలో నడవాలి:*
*జిల్లా కలెక్టర్ రాజర్షి షా*
బంజారా జాతి ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో బుధవారం నిర్వహించిన 287వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సేవాలాల్ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ ఒక వర్గానికే పరిమితం కాదని, సమాజ సంస్కరణ, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, సేవాలాల్ బోధించిన అహింస, సత్యం, క్రమశిక్షణను జీవితంలో ఆచరించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బంజారా భవన్ పనులు త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. గిరిజనుల కుల ధ్రువీకరణ పత్రాలు, అటవీ భూముల హక్కుల సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తామని చెప్పారు. జయంతి కార్యక్రమానికి మారుమూల తండాల ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, గ్రీవెన్స్ కౌంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై సేవాలాల్ విగ్రహం, జిల్లా కేంద్రంలో బంజారా మ్యూజియం ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, బంజారా సంస్కృతి గొప్పదని, దాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత గిరిజన ప్రజలపై ఉందని అన్నారు.
ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సేవల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కి ఐ టి డి ఏ ద్వారా చర్యలు చెప్పాడుతాం అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ప్రజల వినతి మేరకు పట్టణంలో సేవాలాల్ చౌక్ ఏర్పాటుపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తదితరులు కలిసి బంజారా నాయక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో భాగంగా చేసిన బంజారా మహిళల సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
అంతకుముందు ఎంపీ జి.నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, నేతలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్, నరేష్ జాదవ్, అధికారులు అంబాజీ, సురేష్, పార్థసారథి, బంజారా సంఘాల ప్రతినిధులు, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.