
అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పార్వేట వైభవానికి ఇస్కాన్ తరపున భక్తులకు సాదర ఆహ్వానం:
నంద్యాల జిల్లా అహోబిలం సమీపంలోని హరి నగరం వద్ద గల హరేరామ హరేకృష్ణ గోశాల (ఇస్కాన్ నెల్లూరు అవుట్‌పోస్ట్ సెంటర్) వేదికగా ఫిబ్రవరి 18, బుధవారం సాయంత్రం అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం అహోబిలం ఇస్కాన్ ప్రాజెక్ట్ ఇంచార్జ్ చంద్రకేశవ దాసుప్రభు మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక వేడుకలు సాయంత్రం 5:00 గంటలకు ఇస్కాన్ భక్త బృందంచే నిర్వహించే సంకీర్తనలతో ప్రారంభమై, అనంతరం సాయంత్రం 6:00 గంటలకు భోజన ప్రసాద వితరణ, తులసి హారతి, గౌర హారతి మరియు నరసింహ కీర్తనలతో కొనసాగనున్నాయి. రాత్రి 7:00 గంటలకు అతిథుల సత్కారం, రాత్రి 7:30 గంటలకు ముఖ్య అతిథి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పార్వేట సందేశం, మరియు రాత్రి 7:45 నుండి పరమ సుకదేవ స్వామి, సహదేవ ప్రభుజీలచే విశేష ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. రాత్రి 8:30 గంటలకు భారతి కళా సమితి వారిచే డప్పు బృంద ప్రదర్శన, అర్ధరాత్రి 12:30 గంటలకు స్వామివారికి పుష్ప, దీప హారతులతో ఘనంగా ఆహ్వాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరుసటి రోజు ఫిబ్రవరి 19, గురువారం తెల్లవారుజామున 4:00 గంటలకు మంగళ హారతి ఇచ్చి, ఉదయం 5:00 గంటలకు భక్తుల సమక్షంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి అహోబిల ప్రయాణం అంగరంగ వైభవంగా మొదలవుతుందనీ, ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆయన కోరారు.