logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ - శ్రీమతి సరోజినీ నాయుడు జంయంతోత్సవము ( *జాతీయ మహిళా దినోత్సవము)*

తేదీ : 13-02-2026: శేరిలింగంపల్లి చందానగర్: ఈ రోజు ఉదయం కొండాపూర్ డివిజన్ పరిధిలో గల శారదా హైస్కూల్ లో శ్రీమతి సరోజినీ నాయుడు జయంతి వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెట్ శ్రీ బందా నరేంద్ర బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సరోజినీ నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ఆచార్యిణి దేవారెడ్డి విజయలక్ష్మి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " *సరోజినీ నాయుడు గారు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాదు నగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఉన్నత విద్యవంతులు. వీరి తండ్రి డాక్టర్ అఘోరానాథ్ చటోపాధ్యాయ నిజాం కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్. తల్లి వసుంధరాదేవి మంచి కవయిత్రి. సరోజినీ నాయుడు చిన్నతనం నుండి ఆంగ్ల భాషపై మక్కువ చూపేవారు. ఆమె 12వ యేటనే మద్రాసు నగరంలో మెట్రిక్యులేషన్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైన ప్రతిభామూర్తి. ఆవిడ 13వ యేటనే కవిత్వం వ్రాసి అందరి మన్ననలు అందుకుంది. ఆమెయొక్క ప్రతిభాపాటవాలను గమనించిన నిజాం నవాబుగారు స్కాలర్ షిప్ మంజూరు చేసి ఉన్నత విద్యలను అభ్యసించడానికి విదేశాలకు పంపించడం జరిగింది. ఉన్నత విద్యాభ్యాసం చేసి స్వదేశానికి తిరిగివచ్చి డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడుగారిని కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులుగారు జరిపించారు. కులమతాతీత భావనలతో ప్రజలు పెరగాలని అపుడే సమసమాజ స్థాపన సాధ్యమని నమ్మిన వనిత సరోజినీ నాయుడుగారు. తదనంతరం స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని గాంధీగారి ప్రియశిష్యురాలిగా మారారనీ, 1925 సం. లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ"* అని తెలిపారు. " *స్వాతంత్ర్య సంగ్రామంలో దేశమంతా పర్యటించి ' _జాతి వేరని, దేశం వేరని, నువ్వు వేరని విడిగా చూడకు. నీకు జరిగితే దేశానికి జరిగినట్లే. దేశం అనుభవించే బానిసత్వం నువ్వూ అనుభవి‌సత్తున్నట్లేనని ప్రచారం చేస్తూ దేశమంతటా ఊరు, వాడా తిరిగి ప్రజలలో ప్రేరణ కలిగించి దేశభక్తిని పెంపొందించిన వీరతిలకం"*ఈవిడ అని కొనియాడారు.
" మహిళా విద్యకు, మహిళల హక్కులకు, ఓటుహక్కులకు మాత్రమే కాకుండా, రాజకీయ భాగస్వామ్యానికై మహిళా సాధికారికతకు విశేషమైన కృషి చేసినటువంటి మహోన్నత మహిళా నాయకురాలు"* అని కొనియాడారు. " *ఆవిడ భారత దేశంలో తొలి మహిళా రాజకీయ నాయకురాలు. స్వాతంత్ర్యానంతరం భారతప్రభుత్వం ఆమెను ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా నియమించడం జరిగింది. ఈ విధంగా ఆమె భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ గా ప్రసిద్ధి చెందారు. ఆమె కుమార్తె పద్మజా నాయుడుకూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సేవలందించారు"* అని తెలిపారు. " *తనే దేశం, దేశమే తానుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాలమూర్తి ఆవిడ. ఆమె మంచి వక్త మరియు కవయిత్రి. భారతకోకిలగా ప్రసిద్ధి చెందారు. రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో అనేక విధాలైన సేవలు అందించి, మానవసేవ చేయదలుచుకున్న వారికి మార్గాలు అనేకం అని నిరూపించిన మానవతావాది. ఆమె జీవితమంతా మానవసేవకు, దేశసేవకు అంకితం చేసిన పుణ్యమూర్తి. నేటి మహిళా నాయకులు ఆవిడ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మహిళలు ఇంటా, బయటా రక్షణకు, హక్కులకు, సంపూర్ణ సాధికారతకు కృషి చేయడమే మనము ఆవిడకు అర్పించే నిజమైన నివాళి. సరోజినీ నాయుడు మహిళలకు, దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆవిడ గౌరవార్ధం ఆవిడ జన్మదినాన్ని 'జాతీయ మహిళా దినోత్సవం'గా జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శేషుబాబు, విద్యార్థిని, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, వాణి సాంబశివరావు, శివరామిరెడ్డి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

28
1436 views