
ప్రాణదాతలుగా పోలీసులు: 'గోల్డెన్ అవర్స్'లో సి.పి.ఆర్ ప్రాముఖ్యతపై జిల్లా ఎస్పీ దామోదర్ అవగాహన!
సుఖీభవ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసు సిబ్బందిని సి.పి.ఆర్. లో సుశిక్షులను చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిబ్రవరి 9న శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ - సమాజానికి మెరుగైన సేవలందించేందుకు పోలీసు సిబ్బందిని సి.పి.ఆర్. నిర్వహించుటలో సుశిక్షులను చేసేందుకు సుఖీభవ ఆసువత్రి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏదైనా రహదారి ప్రమాదం లేదా మరేదో సంఘటన జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే ఫ్రంట్ లైను వారియర్ సంఘటనా స్థలానికి చేరేది పోలీసులేనన్నారు. సంఘటనా స్థలంలో గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న వారికి అవసరాన్ని బట్టి గోల్డెన్ అవర్స్ లో సి.పి.ఆర్. చేస్తే, వారికి పునర్జన్మ అందించిన వారమవుతామన్నారు.
అయితే, సి.పి.ఆర్. ఎప్పుడు, ఎలా, ఎంతసేపు నిర్వహించాలన్న విషయాలపై తప్పనిసరిగా పూర్తి అవగాహన ఉండాలన్నారు. వైద్యులు సూచించిన పద్ధతిలో సి.పి.ఆర్. నిర్వహిస్తే, సత్ఫలితాలిస్తుందన్నారు. రెగ్యులర్ జీవితంలో బంధువులు లేదా చుట్టు ప్రక్కల వారికి లేదా అపస్మారక స్థితిలో ఉన్న వారికి అవసరమైన సందర్భాల్లో సి.పి.ఆర్. నిర్వహించే విధానం పట్ల పోలీసు సిబ్బందిని సుశిక్షులను చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు.
సుఖీభవ ఆసుపత్రి వైద్యులు రామారావు మాట్లాడుతూ- ఏ పరిస్థితుల్లో సి.పి.ఆర్. అందించాలన్న విషయం పట్ల అవగాహన అవసరమన్నారు. గుండె నుండి రక్త ప్రసరణ ఆగిపోయినపుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని, కార్డియక్ అరెస్టును గుర్తించి, సకాలంలో స్పందించి సి.పి.ఆర్. చేస్తే, తిరిగి గుండెపని చేస్తుందని, తద్వారా మనిషి ప్రాణాలను నిలపవచ్చునన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సుఖీభవ ఆసుపత్రి వైద్యులు రామారావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు గోపాల నాయుడు, రమేష్ కుమార్, శ్రీనివాసరావు, సుఖీభవ ఆసుపత్రి టెక్నికల్ సిబ్బంది, మార్కెటింగు ఎగ్జిక్యూటివ్ సత్తిబాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.