logo

*విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మీడియాపై వివక్ష?* -మీడియా కుటుంబాలకు టికెట్ తప్పనిసరి – అనధికార దర్శనాలు యథేచ్ఛగా?


విజయవాడ/వార్తా ప్రపంచం: ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో మీడియా ప్రతినిధులపై కొత్త నిబంధనలు విధిస్తూ ఆలయ ఈవో శీనా నాయక్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆలయంలో విధులు నిర్వహించే టెంపుల్ రిపోర్టర్ల కుటుంబ సభ్యులు దర్శనానికి వెళ్లాలంటే తప్పనిసరిగా టికెట్ కొనాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడం మీడియా వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

ఒకవైపు మీడియా కుటుంబాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా, మరోవైపు అడ్డుకోవాల్సిన వీఐపీ, వీవీఐపీ దర్శనాలు మాత్రం రోజుకు వందల సంఖ్యలో కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అనధికార దర్శనాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, ఆలయ ఉద్యోగులు దర్శనాల పేరుతో జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

*@-భక్తులపై దాడులు – అధికారుల మౌనం*

గతంలో భక్తులపై వరుస దాడులు జరిగిన ఘటనలు, బోర్డు మెంబర్ భర్త ఆలయ ఉద్యోగులను అమ్మా బూతులు తిట్టిన సంఘటన, నకిలీ రూ.500 టికెట్లతో ప్రోటోకాల్ దర్శనాలు జరిగిన అంశాలపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని మీడియా ఆరోపిస్తోంది. ఈ అక్రమాలపై వార్తలు ప్రచురించడమే కారణంగా మీడియాపై ఈవో పగ పట్టారని ఆరోపణలు చేస్తున్నారు.

*@-చైర్మన్ కార్యాలయం నుంచే అనధికార దర్శనాలు?*

ఇటీవల చైర్మన్ కార్యాలయం నుంచి ఏకంగా 100 నుంచి 150 మంది అనధికార దర్శనాలు చేసినట్లు సమాచారం. అయితే ఈవో మాత్రం ఆలయంలో విధులు నిర్వహిస్తున్న టెంపుల్ రిపోర్టర్ల కుటుంబాలు దర్శనానికి వెళ్తే తప్పనిసరిగా టికెట్ కొనాలని ఆదేశించడం వివక్షకు నిదర్శనమని మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.

*“మీడియాపై ఎందుకు ఈ వివక్ష?”*

దసరా ఉత్సవాలు, భవాని దీక్షలు వంటి ప్రధాన పండుగల సమయంలో వార్తల కవరేజ్ కోసం మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, కానీ ఎవరు పడితే వారు మీడియా అని చెప్పుకునే ఊరు పేరు లేని చానెల్స్ మాత్రం దర్జాగా దర్శనాలకు వెళ్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

*@-దేవాదాయ శాఖ దృష్టికి తీసుకువెళ్లిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)*

ఈ మొత్తం వ్యవహారాన్ని త్వరలో దేవాదాయ కమిషనర్‌, దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మీడియా సిబ్బంది ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామాయణ రెడ్డికి రిప్రజెంటేషన్ కూడా అందజేశారు.

*@-జర్నలిస్టులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలి*

ఉత్సవాల సమయంలో జర్నలిస్టులు వృత్తిపరంగా వార్తలు, విజువల్స్ సేకరణలో నిమగ్నమై ఉండటంతో దేవుడి దర్శనానికి చాలా దూరంగా ఉంటారని, వారు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా దర్శనం కోల్పోతున్నారని NARA పేర్కొంది. ప్రజలకు ఉత్సవాలను చేరువ చేయడంలో కీలకంగా పనిచేస్తున్న జర్నలిస్టుల కృషిని గుర్తించి, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక పాసులు కేటాయించి దర్శన భాగ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ మంత్రిని NARA కోరుతోంది.
ఈ అంశంపై దేవాదాయ శాఖ స్పందించి, అందరికీ ఒకే నిబంధనలు అమలు చేయాలని, మీడియాపై జరుగుతున్న వివక్షకు తక్షణమే ముగింపు పలకాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

12
502 views