logo

జర్నలిస్టుపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడే: సీపీఐ.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న‘టుడే టీవీ’జర్నలిస్టు ఎం.ఆంజనేయులుపై టీడీపీ మండల అధ్యక్షుడు నాగకృష్ణారెడ్డి,ఆయన అనుచరులు భౌతిక దాడికి పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచిన చర్యగా సీపీఐ నంద్యాల జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు.పరమటూరు సహకార సంఘంలో ఎరువుల పంపిణీలో జరిగిన అక్రమాలను ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకే కక్షగట్టి అధికారుల విచారణ పేరుతో పిలిపించి మరీ దాడి చేయడం పాలక దౌర్జన్యానికి నిదర్శనమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు,సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫకృద్దీన్ మండిపడ్డారు.నిజం రాసిన జర్నలిస్టును కొట్టడం కాదు..తప్పుంటే చట్టపరమైన మార్గంలో ఎదుర్కోవాలని హితవు పలికారు.మీడియాను భయపెట్టడం ద్వారా అక్రమాలను దాచిపెట్టాలనే ప్రయత్నాలు ఇక సాగవని వారు హెచ్చరించారు.ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన జర్నలిస్టులపై దాడులు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.జర్నలిస్టులకు రక్షణ లేకపోతే ప్రజల గొంతు మూగబోతుందన్నారు.దాడిలో గాయపడి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అందించాలని,దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను డిమాండ్ చేశారు.జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.మీడియా స్వేచ్ఛపై దాడులు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని సీపీఐ స్పష్టం చేసింది.

2
221 views