
తొలి మహిళా హెవీ వెహికల్ డ్రైవర్‌గా లక్ష్మీదేవి.
నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లాలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించిన లక్ష్మీదేవిని జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి హృదయపూర్వకంగా అభినందించారు. బుధవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్ ఆవరణలో ఆమె సాధించిన ఈ విశిష్ట విజయాన్ని కలెక్టర్ కొనియాడుతూ, ఇది జిల్లాలోని మహిళలకు గర్వకారణమని తెలిపారు. సాధారణంగా ఆటో నడిపే స్థాయి నుంచి ప్రారంభించి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన లక్ష్మీదేవి లారీ, బస్సు వంటి భారీ వాహనాలను నడిపే శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందారని కలెక్టర్ పేర్కొన్నారు.ఏ రంగమైనా మహిళలు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేస్తే, విజయాన్ని సాధించగలరనే విషయానికి లక్ష్మీదేవి ఉదాహరణ అని అన్నారు. ఆమె సాధించిన ఈ విజయం ఎంతోమంది మహిళలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది” అని అన్నారు. పురుషాధిక్యంగా భావించే హెవీ వెహికల్ డ్రైవింగ్ రంగంలో మహిళలు కూడా ప్రతిభతో ముందుకు రావచ్చని లక్ష్మీదేవి నిరూపించారని కలెక్టర్ తెలిపారు. మహిళల సాధికారతకు ఇలాంటి విజయాలు దోహదపడతాయని, భవిష్యత్తులో మరింత మంది మహిళలు ఇలాంటి రంగాల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. లక్ష్మీదేవి ధైర్యం, పట్టుదల, కష్టపడే తత్వం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా యంత్రాంగం పేర్కొంది.