logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -క్యా న్సర్ వ్యాధి అవగాహన కార్యక్రమము.......

తేదీ: 04-02-2026, శేర్ లింగంపల్లి, చందానగర్:ఈరోజు ఉదయము మియాపూర్ డివిజన్ పరిధిలో గల RBR కాంప్లెక్స్ 4వ బ్లాకునందు మహిళలకు క్యాన్సర్ వ్యాధిపై (వ్యాధి లక్షణాలు, రావడానికి గల కారణాలు, నివారణ చర్యలు) మొదలగు విషయములపై అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిటిజన్ హాస్పిటల్ మరియు అమెరికన్ ఆంకాంలజీ ఇన్సిట్యూటుకు చెందిన రేడియేషన్ ఆంకాంలజిస్ట్ డాక్టర్ మల్లిక్ సింగరాజుగారు విచ్చేసి ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ " *ఈరోజు WHO వారు మరియు వరల్డ్ క్యాన్సర్ ఫెడరేషన్ వారు ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కొరకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు"* అని అన్నారు. " *మన శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోవడమే క్యాన్సర్ వ్యాధి* " అని అన్నారు. *"ఇది నెమ్మదిగా మొదలై లక్షణాలు కనిపించే సమయానికి తీవ్రమవుతుంది. అందుకే అవగాహన చాలా అవసరం. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతూవుంది. ఈ వ్యాధి కేవలం ఒకరి జీవితానికే కాదు, ఒక కుటుంబానికే కాదు, మొత్తం సమాజాన్నే ప్రభావితం చేస్తున్న వ్యాధి. క్యాన్సర్ ను ముందస్తుగానే గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే వ్యాధి. క్యాన్సరులో సుమారు 144 రకాలు ఉన్నాయి. తల వెంట్రుక దగ్గరనుండి కాలి గోరు వరకు ఏ భాగానికైనా ఈ వ్యాధి రావచ్చు. మగవారిలో ఓరల్ క్యాన్సర్, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టివ్, కడుపు, లివర్ మొదలగు భాగాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అలాగే మహిళలు బ్రస్ట్ క్యాన్సర్(మొమొగ్రఫి), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (పాప్సిమియర్), ఊపిరితిత్తులు, థైరాయిడ్ మరియు కొలొరెక్టివ్ క్యాన్సర్ వ్యాధుల బారిన ఎక్కువగా పడుతున్నారు* " అని అన్నారు.
*ఈ వ్యాధి లక్షణాలు:*
*1. కారణం లేకుండా బరువు తగ్గడం.*
*2. గాయాలు ఎక్కువ రోజులుగా మానకపోవడం.*
*3. శరీరంలో గడ్డలు, కణితులు ఏర్పడటం* .
*4. నిరంతరం దగ్గు మరియు గొంతు నొప్పి.*
*5. మల, మూత్ర విసర్జనలో మార్పులు రావడం.*
*6. అసాధారణ రక్తస్రావము మొదలగునవి.*
*వ్యాధి రావడానికి గల ప్రధాన కారణాలు:*
*1. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం (ధూమపానం, తంబాకు, గుట్కాలు).*
*2. అధికంగా మద్యం సేవించడం.*
*3. పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్ తినడం.*
*4. శారీరక అధిక బరువు* .
*5. కనీస శారీరక శ్రమ వంటి వ్యాయామం లేకపోవడం.*
*6. మహిళలు చంటి పిల్లలకు చనుబాలు యివ్వకపోవడం* .
*7. కాలుష్యం, గాలి, నీరు మరియు రసాయనాల వలన తమకు తెలియకుండానే ఈ వ్యాధి బారిన పడటం.*
*8. పూర్వికులలో ఈ వ్యాధి బారిన పడినవారు ఉన్నట్లయితే వంశపారంపర్యంగా రావడం.*
*9. అధిక తాపమున్న సూర్యకిరణాల వలన.*
*10. కొన్ని వైరస్ ల ఇన్ఫెక్షన్ల వలన కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు"* అని అన్నారు.
*నివారణ చర్యలు:*
*1. ధూమపానం, మద్యపానము, పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం పూర్తిగా మానివేయాలి.*
*2. తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి* .
*3. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం.*
*4. కోడిగుడ్లు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు వినియోగించడం.*
*5. రెడ్ మటన్ ను మానివేయడం.*
*6. ప్రతిరోజు నడక, వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటి వాటిని చేయడం.*
*7. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం.*
*8. అవసరమైన టీకాలు వేయించుకోవడం.*
*9. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం* .
*10. 40 సంవత్సరముల వయసు దాటిన స్త్రీ, పురుషులు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి"* అని అన్నారు.
" *క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ధైర్యం చెప్పి వారిలో ఆత్మస్థైర్యం నింపాలి. మొదటిదశలోనే వ్యాధి గుర్తింపబడి, చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా జీవిస్తున్నవారు వేలసంఖ్యలో ఉన్నారు. ఈ వ్యాధి బారిన పడినవారు భయపడకుండా పూర్తి అవగాహనతో ధైర్యంగా ఎదుర్కోవాలి. ముందస్తు జాగ్రత్తే ఉత్తమ రక్షణ"* అని అన్నారు. *ఆరోగ్యమే మహా భాగ్యము కావున ప్రతి ఒక్కరూ అనారోగ్యం అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా, వెంటనే వైద్యుని సంప్రదించి తగిన సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి* " అని అన్నారు.
ఈ సందర్భంగా అందరిచేత *"ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుందాం - క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకుందాం_ మరియు పంచుకుందాం"* అని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అపార్ట్ మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు, మున్నాభాయ్ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీమతి కస్తూరి, రఘునాధరావు, విష్ణు ప్రసాద్, శివరామ రెడ్డి మరియు హాస్పిటల్ ప్రతినిధులు శ్రీశైలం మరియు జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

34
951 views