logo

భక్తి వైభవానికి చిరునామాగా అంతకాపల్లి… ఘనంగా మజ్జి గౌరమ్మ అమ్మవారి 47వ జాతర



విజయనగరం జిల్లా– రాజాం.

రాజాం మండలం అంతకాపల్లి గ్రామం మూడు రోజుల పాటు భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో ఉప్పొంగిపోయింది. గ్రామ దేవతగా కొలువైన శ్రీ శ్రీ శ్రీ మజ్జి గౌరమ్మ అమ్మవారి 47వ జాతర మహోత్సవాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఎటు చూసినా భక్తుల సందడి, అమ్మవారి నామస్మరణతో అంతకాపల్లి గ్రామం పుణ్యక్షేత్రంలా మారింది.
ఆలయ కమిటీ సభ్యులు మజ్జి జోగినాయుడు ఆధ్వర్యంలో జాతరను అత్యంత క్రమబద్ధంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శన, భద్రత, త్రాగునీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసి సేవా భావానికి నిదర్శనంగా నిలిచారు.
స్వచ్ఛ సంస్థల సహకారంతో పులిహోర, మజ్జిగ వంటి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయగా, అమ్మవారి ప్రసాదంగా స్వీకరించిన భక్తులు ఆనందంతో పరవశించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆటపరికరాలు, వినోద కార్యక్రమాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ పవిత్ర యాత్రలో శుక్రవారం రాజాం నియోజకవర్గ శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన రాకతో జాతరకు మరింత ప్రాధాన్యం దక్కింది. ఆదివారం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైయస్సార్సీపి రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై యాత్ర వైభవాన్ని తిలకించారు.
ఆదివారం యాత్ర ముగింపు సందర్భంగా రాత్రి నిర్వహించిన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు భక్తులను అలరించాయి. నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో జాతర ముగింపు వేడుకలు కన్నుల పండువగా సాగాయి. మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జాతరను నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను గ్రామ ప్రజలు ఘనంగా అభినందించారు.

4
482 views