
60 రోజుల అనర్హత అర్హత ఈ సమావేశాలతో పూర్తి...
నెల రోజుల పాటు ఏపీ అసెంబ్లీ – పెద్ద ప్లానే !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈసారి ముందెన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 12న ప్రారంభించి, మార్చి 12 వరకు నెల రోజుల పాటు సభను నడపాలని నిర్ణయించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా, సభకు వరుసగా గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వంపై వేటు వేసేందుకు అవసరమైన అర్హత సాధించడమే ఈ సుదీర్ఘ షెడ్యూల్ వెనుక ఉన్న అసలు టార్గెట్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.60 రోజుల అనర్హత అర్హత ఈ సమావేశాలతో పూర్తి
రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఒక సభ్యుడు వరుసగా 60 పని దినాల పాటు సభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సభ ఏర్పడినప్పటి నుండి సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ సభ్యులను, ఈసారి కూడా రాకుండా ఉంటే ఆ నిబంధన పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే, కేవలం ఒక రోజు హాజరై సంతకం చేసి వెళ్లడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కవచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నైతికత అనే అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది.
దొంగ సంతకాలు, జీతాలు తీసుకుంటున్న వారిపై ఎథిక్స్ కమిటీ సిఫారసులు
సభకు రాకుండా, చర్చల్లో పాల్గొనకుండా కేవలం సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకోవడం ప్రజలను వంచించడమేనని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన బాధ్యతను విస్మరించి, కేవలం సాంకేతిక కారణాలతో సభ్యత్వాన్ని కాపాడుకోవాలని చూడటం వారి నైతిక పతనానికి నిదర్శనమని విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని, అసెంబ్లీ నియమావళిని గౌరవించని వారికి గట్టి గుణపాఠం చెప్పే దిశగా స్పీకర్ నిర్ణయం ఉండబోతోందని సమాచారం. ఎథిక్స్ కమిటీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పిస్తే.. అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటుంది.
వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి
వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా సభకు డుమ్మా కొడితే, చట్టపరమైన చిక్కులు తప్పవని గట్టిసూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో, వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉభయ సంకటంలో పడ్డారు. అటు అధినేత ఆదేశాలు పాటించాలా? లేక సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు సభకు వెళ్లాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు వేదిక కానున్నాయి.