logo

మరణ మార్గంగా రాజాం–చీపురుపల్లి రహదారి: అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలకు గండం!


*రాజాం–చీపురుపల్లి ప్రధాన రహదారి ప్రమాదాలకు కేంద్రంగా మారినా ఆర్&బి (రోడ్లు మరియు భవనాలు) శాఖ అధికారుల నిద్ర మాత్రం చెడటం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాలు పోతున్నా, గాయాల పాలవుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల ప్రాణాల పట్ల వారి వైఖరిని బట్టబయలు చేస్తోంది.*
*గ్రామ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి జరిగిందంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ హయాంలో, రాజాం–చీపురుపల్లి రహదారి మాత్రం భద్రతా ప్రమాణాలు లేని “మరణ మార్గం”గా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదకర మలుపులు, రోడ్డు పక్కన విస్తరించిన పొదలు, మట్టి దిబ్బలు, ఎక్కడా హెచ్చరిక బోర్డులు లేవు… రిఫ్లెక్టర్లు లేవు… స్పీడ్ నియంత్రణ అన్న మాటే లేదు. ఇవన్నీ అధికారుల కళ్లకు కనిపించడంలేదా..? లేక చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.*
*ప్రమాదాలు జరుగుతుంటే ఫైళ్లలో నోటింగులు రాయడమే తప్ప, రహదారిపైకి వచ్చి పరిస్థితిని పరిశీలించే తీరిక కూడా ఆర్&బి అధికారులకు లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ప్రమాదాల అనంతరం ‘పరిశీలిస్తాం’, ‘ప్రతిపాదనలు పంపాం’ అనే మాటలు వినిపిస్తున్నాయే తప్ప, భూమిపై ఒక్క ఇటుక కూడా కదలడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.*
*ఈ పరిస్థితుల్లో రాజాం పట్టణ సీఐ కె. అశోక్ కుమార్ చొరవతో రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదలు, మట్టి దిబ్బలు తొలగించడం కొంత ఉపశమనంగా మారినా, ఇది పోలీసుల పని కాదు… రహదారి భద్రత ఆర్&బి శాఖ బాధ్యత కాదా..? అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అధికారులు చేతులు ముడుచుకుని కూర్చుని, పోలీసులు రంగంలోకి దిగాల్సి రావడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.*
*ఇప్పటికైనా ఆర్&బి ఉన్నతాధికారులు నిద్ర లేచి స్పందించాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయి రహదారి మరమ్మత్తులు, ప్రమాద నివారణ బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోతే మరిన్ని ప్రాణాలు బలైపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.*
*రక్తపాతం జరిగాక స్పందించడమేనా పాలన..? ప్రజల ప్రాణాల విలువ అధికారుల దృష్టిలో ఇదేనా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.*

6
938 views