
అంబరంగా సంబరం..పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సంధ్యారాణి ...
పోలమాంబను దర్శించుకున్న వేలాదిమంది
AIMAMEDIA : గిరిజనుల ఆరాధ్య దేవతగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. లక్షలాది మంది భక్తుల కేరింతల మధ్య గ్రామ పురవీధుల్లో సిరిమాను తిరిగింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గోస్తనీ నదిలో స్నానాలు చేసి అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌పి ఎన్‌వి మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, పవార్ జగన్నాధ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభం కావాల్సిన సిరిమానోత్సవం అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైంది. పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ సాయంత్రం ఆరున్నర గంటలకు ముగిసింది. తొలుత డప్పు వాయిద్య కారులను గ్రామస్తులు, పోలీసులు అమ్మవారి వద్దకు తీసుకువచ్చేందుకు సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో వెళ్లారు. అనంతరం పూజారి జన్నిపేకాపు జగదీశ్వరరావును సినిమానుపై అధిరోహింప జేశారు. ఎప్పటి మాదిరిగానే గిరడ వారి ఇంటి వద్ద పూజలు అందుకున్న అమ్మవారు కరణం, నాయుడు వారి ఇళ్ల వద్దకు వెళ్లి పూజలు తీసుకుని గ్రామంలో ప్రధాన రహదారి గుండా ఊరేగింది. ఎస్‌సి కాలనీ, పనుకువీధి, గొల్ల వీధుల మీదుగా సావిడి వీధిని చేరుకోవడంతో సినిమాను రథోత్సవం ముగిసింది. అక్కడే సిరిమానురధాన్ని బోల్తా వేసి పూజారిని చదురుగుడిలోకి సాయంత్రం తీసుకువెళ్లడం తో సినిమాను జాతర ముగిసింది. సమన్వయ లోపంతో సినిమాను ఆలస్యంజాతర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా సినిమానోత్సవం ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లా స్థాయి అధికారులంతా సమయానికి జాతర జరిపించాలనుకున్నప్పటికీ. స్థానికంగా కమిటీ, గ్రామ పెద్దలు, యువత మధ్య సమన్వయం కొరవడంతో రథోత్సవం సుమారు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో భక్తులు అసహనం గురై సకాలంలో అమ్మవారు దర్శించుకోలేకపోతున్నామని దూర ప్రాంత భక్తులు ఆవేదన చెందారు. వెయ్యి మంది పోలీసులతో భద్రతజాతరలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందిని భద్రత కోసం వినియోగించారు.
బందోబస్తును ఎస్‌పి మాధవరెడ్డి దగ్గరుండి పరిశీలించారు. విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వెర్టర్ల సహాయంతో నిఘా పరికరాలను వినియోగించారు. మారు జాతరకు ఇదో అనుభవం : సబ్ కలెక్టర్ వైశాలి పోలమాంబ జాతర నిర్వహణలో తలెత్తిన కొన్ని లోటుపాట్లను రానున్న మారు జాతరకు అనుభవంగా తీసుకుంటామని జాతర ఇంఛార్జి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి అన్నారు. స్థానిక ప్రజలు సమన్వయ లోపంతోనే సినిమాను ప్రారంభోత్సవం ఆలస్యం అయిందని తెలిపారు. మరో జాతరకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా చూస్తామన్నారు. ఎండలో నిరీక్షణఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రఖ్యాత శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లలో దేవాదాయశాఖ అధికారులు విఫలమయ్యారు. అమ్మవారి దర్శనానికి ఏర్పాటు చేసిన భారీ క్యూలైన్ కిలోమీటరు మేర భక్తులు నిలబడ్డారు. 200 మీటర్ల వరకు ఎండ తగలకుండా టెంట్లు వేశారు. వంతెన మీద వరకు భక్తులు ఎండలో నిలబడి నానా అవస్థలు పడ్డారు. పోటెత్తిన యాత్రికులుశంబర పోలమాంబ జాతరకు భక్తులు పోటెత్తారు. హాజరైన భక్తుల్లో ఎక్కువగా మహిళలే వున్నారు. ఉచిత బస్సు ప్రయాణాలతో అధికంగా మహిళలు విచ్చేశారు. ఆర్టీసి సంస్థ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధిక సంఖ్యలో బస్సులను నడిపింది. జాతరకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచే కాకుండా పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు.
జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, జెసి
పోలమాంబ అమ్మవారి సిరిమాను ఉత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది పరిశీలించారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి తాగునీరు, పారిశుధ్యం, చలువ పందిరిలు, దర్శనం వంటి ఇతర వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిసి కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్‌పి ఎస్‌వి మాధవ్‌రెడ్ది కలెక్టరుకు వివరించారు. పోలీసుల బందోబస్తు, వైద్య శిబిరాలు, స్వచ్చంద సేవకుల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. పోలమాంబను దర్శించుకున్న కలెక్టర్, జెసిపోలమాంబ అమ్మవారిని కలెక్టర్ ప్రభాకర రెడ్ది, జెసి యశ్వంత్ కుమార్ రెడ్ది దర్శించుకున్నారు. ఆలయ పూజారులు సాంప్రదాయక రీతిలో పూజాకార్యక్రమాలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ పర్యటనలో సబ్‌కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాధ్, అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వర రావు, ఎఎస్పీ వి.మనీషా రెడ్ది, జిల్లా అధికారులు పాల్గొన్నారు.