logo

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమే 40 టీఎంసీలు తరలించామంటూ నాటకాలు

చీకటి ఒప్పందంతోనే రాయలసీమ లిఫ్ట్‌కు సమాధి. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమే 40 టీఎంసీలు తరలించామంటూ నాటకాలు
వైఎస్‌ఆర్‌ చొరవతోనే 2012 నుంచి రాయలసీమకు కృష్ణాజలాలు
2016–17లో 38 టీఎంసీలు..2018–2019లో 39 టీఎంసీలు రాలేదా?
2019–20లో 47.34 టీఎంసీలు.. 2020–21లో 45.65 టీఎంసీలు తరలింపు
నాలుగు సార్లు సీఎంగా ఉండి హంద్రీనీవాకు బాబు చేసింది శూన్యం. 40 టీఎంసీలను 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబే..!.నిజంగా నేడు 3850 క్యూసెక్కుల ప్రవాహముంటే 63 టీఎంసీలు రావాలి కదా? 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేసినా 2500 క్యూసెక్కులు కూడా రాకపోవడమేంటి?. ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్‌ అధికారులు దీనికి సమాధానమివ్వాలి హంద్రీనీవా కాలువ వెడల్పు, లైనింగ్‌ పేరుతో అవినీతి. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సమాధి కడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేయడంతో సీమ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో హంద్రీనీవా ద్వారా 190 రోజుల్లో 40 టీఎంసీలు తరలించామంటూ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రచార ఆర్భాటం తప్పితే చిత్తశుద్ధితో ఏపనీ చేయరని విమర్శించారు. అపద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు సాటెవరూ లేరని ఎద్దేవా చేశారు. హంద్రీనీవాకు ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేసి పునాదిరాయి మాత్రమే వేశారన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లో ఉరవకొండలో హంద్రీనీవాకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మళ్లీ 1999లో 40 టీఎంసీలు కాదని 5 టీఎంసీలకే హంద్రీనీవాకు కుదించి ఆత్మకూరులో శంకుస్థాపన చేశారని తెలిపారు. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 5 టీఎంసీల జీవోను రద్దు చేసి 40 టీఎంసీలకు చేశారని అన్నారు. ఆ తర్వాత పనులు వేగవంతం అయ్యాయని, దాని ఫలితంగానే 2012 నుంచి రాయలసీమకు కృష్ణాజలాలు వస్తున్నాయన్నారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక అనంతపురంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా హంద్రీనీవా సామర్థ్యాన్ని 10 వేలకు పెంచాలని తాము కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత 6300 క్యూసెక్కుల సామర్థ్యంతో పనులు చేయడానికి నిధులు మంజూరు చేయడంతో పాటు వైసీపీ హయాంలోనే టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. అదేవిధంగా శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేలా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. కానీ, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన స్వార్థరాజకీయాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని సీమ ప్రాజెక్ట్‌కు సమాధి కట్టారన్నారు. స్వయంగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని ఉటంకించారు. హంద్రీనీవా ద్వారా 14 ఏళ్ల నుంచి రాయలసీమకు నీళ్లు వస్తున్నాయని.. ఎన్నడూ లేని విధంగా ఈసారే 40 టీఎంసీలు తెచ్చినట్లు చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 1995 నుంచి 1999 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు తన పాలనలోనే గాలేరు నగరి, హంద్రీనీవా పూర్తి చేసి ఉంటే.. 2004లో ఏర్పడిన బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌తో రాయలసీమ నీటి వాటా వచ్చేదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేతగానితనంతోనే రాయలసీమ నీటివాటానే చేజార్చుకున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా హంద్రీనీవా ద్వారానే 2016–17లో 38 టీఎంసీలు..2018–2019లో 39 టీఎంసీలు వచ్చాయన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2019–20లో 47.34 టీఎంసీలు.. 2020–21లో 45.65 టీఎంసీలు హంద్రీనీవా ఎత్తిపోతల ద్వారా తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, నేడు 12 పంపుల సామర్థ్యంతో 3850 క్యూసెక్కులు చొప్పున 190 రోజుల్లో 40 టీఎంసీలు తరలించామనడం హాస్యాస్పదమన్నారు. పైగా వంద రోజుల్లో హంద్రీనీవా తొలి, రెండో దశ పనులకు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. నిజంగా 3850 క్యూసెక్కులు తరలించి ఉంటే 190 రోజుల్లో సుమారు 63 టీఎంసీలు తరలించి ఉండాలని, మరి ఎందుకు కేవలం 40 టీఎంసీలే వచ్చాయని ప్రశ్నించారు. అందరూ కలిసి సీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 798 అడుగుల్లోనే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి పేరుతో నీటిని తోడేస్తోందని.. 800 అడుగులకు చేరగానే సాగుకు విడుదల చేసుకుంటున్నా చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. 3850 క్యూసెక్కుల సామర్థ్యంతో తొలి దశ కాలువ వెడల్పు చేశామని చెప్పి తీరా ఇప్పుడు 2500 క్యూసెక్కులు కూడా తీసుకురావడం లేదన్నారు. దీనికి ఇంజనీరింగ్‌ అధికారులు సమాధానం చెప్పాలని తెలిపారు. పేరుకు మాత్రమే హంద్రీనీవా వెడల్పు చేశారని, రూ.3 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. విశాఖలో రూ.99 పైసలకు భూములు అమ్ముకునేందుకు.. రాజధాని పేరుతో అమరావతి కోసం కోట్లు అప్పులు చేయడం మినహా రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఓవైపు సీమ హక్కులకు సమాధి కడుతూ 40 టీఎంసీలు తరలించామంటూ క్రెడిట్‌ చోరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కూడా ల్యాండ్‌ టైట్లింగ్‌పై దుష్ప్రచారం చేసి ఇప్పుడు వైఎస్‌ జగన్‌ తెచ్చిన రీసర్వే పనులే చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు క్రెడిట్‌ చోరీ చేయడం అలవాటుగా మారిందన్నారు. రాయలసీమ హక్కుల కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

0
0 views