
మంత్రి సత్య కుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో మహిళా ఆరోగ్య సేవలు...
మంత్రి సత్య కుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో స్వప్న సురక్ష అమలు
ధర్మవరంలో ఘనంగా ‘స్వప్న సురక్ష’ మహిళా ఆరోగ్య కార్యక్రమం
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం – హరీష్ బాబు
మంత్రి సత్య కుమార్ యాదవ్ మార్గదర్శకత్వంలో మహిళా ఆరోగ్య సేవలు – హరీష్ బాబు
ధర్మవరం, జనవరి 24:– మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వప్న సురక్ష – మహిళల ఆరోగ్యానికి సురక్ష కవచం కార్యక్రమం శనివారం ధర్మవరం పట్టణంలో పలు ప్రాంతాల్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ధర్మవరం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో, పిఆర్టి సర్కిల్లోని శక్తి భవన్లో, అలాగే తేర్ బజార్లోని కొత్త సత్రం వద్ద ఒకేసారి నిర్వహించబడగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, అనంతరం ఆయన మహిళలతో మమేకమై వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని, కార్యక్రమంలో వైద్యులు అందిస్తున్న సేవల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ,.. రాష్ట్ర వైద్య & ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆశీస్సులు, మార్గదర్శకత్వంలోనే ఈ స్వప్న సురక్ష కార్యక్రమం అమలు అవుతోందని తెలిపారు. మహిళల ఆరోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాయని, ప్రతి మహిళకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్య కుమార్ యాదవ్ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయాన్ని హరీష్ బాబు గుర్తు చేశారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని, నివారణే ఉత్తమ వైద్యం అనే ఆలోచనతో ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు. అదేవిధంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి మార్గదర్శకత్వంలో మహిళల కోసం అనేక ఆరోగ్య కార్యక్రమాలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. మహిళ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం, సమాజ ఆరోగ్యం అని స్పష్టం చేసిన హరీష్ బాబు, ఇలాంటి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అందించిన సేవలు మహిళలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపరీక్షలు, BMI పరీక్షలు, గర్భిణీ మహిళలకు ప్రత్యేక వైద్య సలహాలు, మహిళలకు అవసరమైన పోషకాహారంపై అవగాహన, మహిళల వ్యాధులపై నిపుణ వైద్యుల సూచనలు, అవసరమైన వారికి రిఫరల్ సేవలు, అలాగే మహిళలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య పథకాలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణయ్య, పి.డి. నాగరాజు, టిపిఆర్ఓ విజయ భాస్కర్, వైద్య సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.