logo

నవజీవన్ బధిరుల పాఠశాల బాలికలకు క్రీడా పరికరాల పంపిణీ.

నంద్యాల (AIMA MEDIA): శనివారం జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బధిరుల ప్రత్యేక పాఠశాలలో ఉన్న బాలికలకు పదివేల రూపాయల క్రీడా పరికరాలు మహిళా వైద్యులు అందజేశారు.నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నవజీవన్ పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ మర్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ బాలికల ఆరోగ్య, సామాజిక సంరక్షణ కోసం నంద్యాల ఐ ఎం ఏ మహిళా వైద్య విభాగం ద్వారా వివిధ పాఠశాలలలో బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శ లపై, ఋతు స్రావ శుభ్రత,యుక్త వయసులో వచ్చే మార్పులపై వచ్చే మార్పులు, సామాజిక మాధ్యమాల వలన కలిగే ప్రయోజనాలు,దుష్పరిణామాలు, పౌష్టికాహారం గురించి వివరించడానికి సదస్సులను తరచూ నిర్వహిస్తున్నామని అన్నారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ బాలికలను చదువు లో,
క్రీడలలో,సాంస్కృతిక కళలలో ప్రోత్సహించడం చాలా అవసరం అన్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలకు సహకారం కొనసాగిస్తామన్నారు.ఫాదర్ మర్రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ వైద్యులు నవజీవన్ పాఠశాలకు, గోపవరం మానసిక పాఠశాలకు ప్రతి ఏటా వివిధ రూపాలలో సహకరిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బధిర బాలికలు తమకు వినిపించక పోయినప్పటికీ పాట లో వస్తున్న సంగీతానికి అనుగుణంగా, వారి నాట్య గురువు చూపించే సంకేత భాష సహకారంతో లయబద్ధంగా చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆశ్చర్యపరిచాయి.ఈ కార్యక్రమంలో నవజీవన్ పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుధ,నంద్యాల మహిళా వైద్య విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ నర్మద,డాక్టర్ కల్పన, నవజీవన్ ప్రత్యేక పాఠశాల కరస్పాండెంట్ జాన్ మేరీ, హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, భాస్కర్, పాఠశాల బాల బాలికలు, సిబ్బంది పాల్గొన్నారు.

0
553 views