
నేడు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి
AIMA న్యూస్ బ్యూరో. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల్లో రాయలసీమ ప్రాంతంలో పరిటాల రవి అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. అనంతపురం జిల్లా రాజకీయాల్లోకి ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రస్థానం మొదలుపెట్టి, తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పరిటాల రవీంద్ర జీవితం సాహసాలు, సవాళ్లు మరియు వివాదాల సమ్మేళనం.1958, ఆగస్టు 30న అనంతపురం జిల్లా పెనుగొండ మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల శ్రీరాములు, సత్యవతి దంపతులకు రవి జన్మించారు. ఆయన తండ్రి శ్రీరాములు కమ్యూనిస్ట్ భావజాలంతో పేదల పక్షాన పోరాడేవారు. 1975లో ప్రత్యర్థుల చేతిలో తండ్రి శ్రీరాములు హత్యకు గురవ్వడం రవి జీవితాన్ని మలుపు తిప్పింది. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పరిటాల రవి నక్సలైట్లు వైపు ఆకర్షితులయ్యారు. కొంతకాలం అజ్ఞాతంలో గడిపిన ఆయన, పేదల భూముల కోసం పోరాటాలు చేశారు.నక్సలిజం కంటే రాజకీయ అధికారం ద్వారానే ఎక్కువ సేవ చేయవచ్చని భావించిన పరిటాల రవి 1994లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పిలుపు మేరకు టిడిపిలో చేరారు. ఎన్నికల విజయంతో 1994లో అనంతపురం జిల్లా పెనుగొండ నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.ఎన్టీఆర్ క్యాబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.తన నియోజకవర్గంలో పేదలకు భూములు ఇప్పించడం, పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లు చేయడం వంటి పనులతో ఆయన నిరుపేదల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నారు.మద్దెలచెరువు సూరితో వైరం
పరిటాల రవి జీవితంలో వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మద్దెలచెరువు సూరి కుటుంబంతో ఉన్న ఫ్యాక్షన్ వైరం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1997లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కార్ బాంబ్ బ్లాస్ట్ సంఘటన ఆయనను లక్ష్యంగా చేసుకుని జరిగిందే. ఈ దాడిలో రవి ప్రాణాలతో బయటపడినా, అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనల నేపథ్యంలో పరిటాల రవి పేరు రాష్ట్రవ్యాప్తంగా తెలిసింది. ఆయనకు చుట్టూ భద్రత భారీగా ఉండేది. 2005, జనవరి 24న అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక చీకటి రోజు అనంతపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై బయటకు వస్తున్న ఆయన మధ్యాహ్నం 2గంటల సమయంలో ప్రత్యర్థులు ఆయనపై ఏడు బుల్లెట్ కాల్పులు జరిపారు. పరిటాల రవి తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న అనంతపురం జిల్లా అట్టుడికిపోయింది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులు తమ నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. పరిటాల రవి జీవితం ఒక యుద్ధం లాంటిది. కొందరికి ఆయన ఒక ఫ్యాక్షన్ నాయకుడు కావచ్చు, కానీ వేలాది మంది పేదలకు ఆయన ఒక ఆపద్బాంధవుడు. ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పరిటాల రవి జీవిత కథనంపై రక్త చరిత్ర సినిమా తీయడం జరిగింది.అనంతపురం చరిత్ర ఉన్నంత కాలం పరిటాల పేరు రికార్డుల్లో నిలిచి ఉంటుంది.