logo

పోలీసు యూనిఫాం విలువను కాపాడండి: శిక్షణార్థులకు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ దిశానిర్దేశం


పట్టణం సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 22న ఆకస్మికంగా సందర్శించారు. శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్ళతో మమేకమై, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించడంతోపాటు, కేంద్రంలోని మౌళిక వసతులు, వసతి, మెస్ గురించి శిక్షణార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - ప్రజలకు నేరుగా సేవచేసే పోలీసు ఉద్యోగం సాధించినందుకు ప్రతి శిక్షణ కానిస్టేబులు గర్వంగా భావించాలన్నారు. కరోనా సమయంలో పోలీసు, వైద్యశాఖలు ఫ్రంట్ లైన్ వారియర్లుగా నిలిచాయని గుర్తుచేశారు. పోలీసులు క్రమశిక్షణతో కూడిన శారీరక శిక్షణ పొందడం వలనే మెరుగైన ఇమ్యూనిటీ పొంది, కోవిడ్ వైరస్‌ను ఎదుర్కోగలిగారని, అందుకే ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సమాజంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు పోలీసులనే ఆశ్రయిస్తున్నారంటే, ఆ యూనిఫాంకు ఉన్న విలువను అర్థం చేసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. శిక్షణ నుండే ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో, తీవ్రవాదాన్ని, మావోయిజాన్ని అరికట్టడంలో ఏపీఎస్పీ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిపారు.
జీవితంలో చెడు వ్యసనాలకు, డ్రగ్స్‌కు ఆకర్షితులు కావద్దని, సాంకేతికతను అందిపుచ్చుకొని విధులను స్మార్ట్‌గా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణార్థుల వసతి గదులు, తరగతి గదులను పరిశీలించి, ఇండోర్, అవుట్ డోర్ తరగతుల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. శిక్షణార్థులను ఉత్సాహపరిచే విధంగా శిక్షణ ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో కలిసి ఎస్పీ భోజనం చేసి, మెనూలో కొన్ని మార్పులను సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిపిటిసి డిఎస్పీ పి.నారాయణరావు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, డిపిటిసి సిఐలు ఎస్.కాంతారావు, ఆర్.ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.గోవిందరావు, చంద్రశేఖర్, ఆర్ఐ టి. శ్రీనివాసరావు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

7
202 views