logo

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు, క్రమశిక్షణను పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలి* ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్.

*రహదారి భద్రత ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత*
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు, క్రమశిక్షణను పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలి*
ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్.
నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్, ట్రైనీ ఐపీఎస్ అశ్వీన్ మనిదీప్, డిటిసి వీర్రాజు, తదితరులు..
రహదారి భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్ పేర్కొన్నారు. గురువారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని ఇంచార్జి జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణుచరణ్, ట్రైనీ ఐపీఎస్ అశ్వీన్ మనిదీప్, డిటిసి వీర్రాజు, ఆర్డీఓ కేశవనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు మరియు క్రమశిక్షణను పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. ​రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు విశాఖపట్నం జిల్లాలో 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ​ఈ కార్యక్రమంలో భాగంగా గత 21 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 96 అవగాహన సదస్సులు నిర్వహించారని, ఇందులో సుమారు 5,000 మంది విద్యార్థులు, 2,000 మందికి పైగా డ్రైవర్లు, వాహనదారులు మరియు ప్రజలు పాల్గొన్నారన్నారు. రవాణా శాఖ అధికారులు జిల్లాలో 37 ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్ లను) గుర్తించి, వాటికి అవసరమైన మరమ్మతులు మరియు ఆడిటింగ్ పూర్తి చేశారన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారని, ​హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై సుమారు 2000కు పైగా కేసులు నమోదయ్యాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 30 నుండి 35 వరకు ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశారని, డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా కంటి పరీక్షలు మరియు రక్త పరీక్షలతో కూడిన హెల్త్ క్యాంపులను రవాణా శాఖ ఏర్పాటు చేసిందన్నారు. రహదారి భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డిటిసి వీర్రాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం సుమారు 360 మంది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది 18 నుండి 25 ఏళ్లలోపు యువత ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి చిన్నపాటి అజాగ్రత్తలే ప్రాణాంతకమవుతున్నాయన్నారు. ఇప్పటివరకు కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించామని, ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ​హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయల జరిమానా ​డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 'జీరో ఫటాలిటీ' అంటే ఒక్కరు కూడా ప్రమాదాల్లో చనిపోకూడదనే లక్ష్యంతో రవాణా, పోలీస్, ఇంజనీరింగ్ మరియు వైద్య శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ​ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించి, తమ ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సురేష్ నాయుడు, డిఎస్పీ మహబూబ్ భాష, ట్రాఫిక్ సిఐ వెంకటేష్ నాయక్, రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

7
202 views