logo

ఆళ్లగడ్డ రహదారులపై యమపాశం.రక్తం చిందిస్తున్న జాతీయ రహదారులు

AIMA న్యూస్. నంద్యాల జిల్లా
ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట నెత్తురు చిందిన చారలే కనిపిస్తున్నాయి. అజాగ్రత్త, అతివేగం మరియు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. కడప-కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ మీదుగా వెళ్లే వాహనాల వేగానికి కళ్లెం లేకుండా పోయింది. ఇవాళ గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సిరివెళ్ల మెట్ట వద్ద ప్రైవేటు బస్సు మంటల్లో కాలి బూడిదైంది. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రవేట్ బస్సు టైర్ పేలడంతో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీ కొట్టింది . ఈ సంఘటనలో DCM డ్రైవర్ ధైర్యంగా బస్సు అద్దాలను పగలగొట్టి అందులోని 36 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు క్లీనర్ చనిపోవడం జరిగింది.ముఖ్యంగా రాత్రి సమయాల్లో భారీ వాహనాల రాకపోకలు పెరగడం, మలుపుల వద్ద సరైన వెలుతురు లేకపోవడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. అహోబిలం క్రాస్ రోడ్డు, నల్లగట్ల మలుపు, మరియు పట్టణ శివార్లలోని ప్రధాన కూడళ్లు బ్లాక్ స్పాట్స్ గా మారుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.అతి వేగం,అజాగ్రత్త హైవేపై వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడం, నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ టేక్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణం. ప్రమాదకరమైన మలుపులు, స్పీడ్ బ్రేకర్ల వద్ద సరైన హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు కనిపించకపోవడం రాత్రి వేళల్లో ప్రాణాంతకంగా మారుతోంది. కొంతమంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇతర వాహనదారులు బలి అవుతున్నారు. పట్టణ పరిధిలో లైసెన్స్ లేని మైనర్లు బైక్‌లతో విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు.
ప్రమాదాలు జరుగుతున్న సమయంలో హడావిడి చేయడం మినహా, శాశ్వత నివారణ చర్యలు చేపట్టడంలో సంబంధిత శాఖల అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.హైవే పెట్రోలింగ్ నిరంతరం కొనసాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తక్షణమే చేపట్టాల్సిన చర్యలు
ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, బ్లింకర్ లైట్లు ఏర్పాటు చేయాలి.ముఖ్యమైన కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వెలుతురు ఉండేలా చూడాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో తనిఖీలు ముమ్మరం చేయాలి.అతివేగంగా వెళ్లే వాహనాలకు స్పీడ్ గన్‌ల ద్వారా జరిమానాలు విధించాలి.ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ తక్షణమే స్పందించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు

89
4373 views