
లెంగ్తీ క్వశ్చన్ లీడర్స్‌కు దావోస్ పెద్ద పజిలే – అవసరమా వైసీపీ!?.....
లెంగ్తీ క్వశ్చన్ లీడర్స్‌కు దావోస్ పెద్ద పజిలే – అవసరమా వైసీపీ!?
జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ఒక్క సారి వెళ్లారు. అది కూడా విహారయాత్రకు వెళ్లి.. మధ్యలో రెండు రోజులు దావోస్‌కు వెళ్లారు. మొహమాటంగా సమావేశాల్లో పాల్గొన్నారు. ఓ సమావేశంలో మోడరేటర్ అడిగిన ప్రశ్న అర్థం కాక జగన్.. ఇట్స్ లే లెంగ్తీ క్వశ్చన్ అని తప్పించుకున్నారు. దాంతో పరువు పోయింది. మళ్లీ దావోస్ జోలికి వెళ్లలేదు. ఎందుకు వెళ్లడం లేదంటే ఘనత వహించిన అప్పటి మంత్రి అమర్నాథ్.. చలి ఎక్కువని కవర్ చేసుకుని నవ్వుల పాలయ్యారు. కానీ ఇప్పుడు చంద్రబాబు టీం దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూంటే ఏపీలో కూర్చుకుని.. అందరి ముందు నవ్వుల పాలయ్యే విమర్శలు చేస్తున్నారు.
దావోస్ లాంటి వాటితో గెలుక్కోవడం ఎందుకు ?
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం దావోస్ వేదికగా శ్రమిస్తుంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రంగంలోకి దిగి, దావోస్ పర్యటన కేవలం డబ్బు దండగ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ తీరును హైలెట్ చేస్తున్నాయి. పెట్టుబడులు, పరిశ్రమలు అనే పదాలకు వైసీపీ పాలనలో అర్థమే మారిపోయింది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దావోస్‌లో విపరీతమైన చలి ఉంటుందని, అందుకే వెళ్లడం లేదంటూ ఆయన చెప్పిన సాకు అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు నేను అలా అనలేదు అని ఆయన మాట మారుస్తున్నప్పటికీ, నాటి వీడియో క్లిప్పింగ్‌లతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు. తాను వెళ్లలేకపోయినప్పుడు చలిని సాకుగా చూపిన అమర్నాథ్, ఇప్పుడు ప్రభుత్వం వెళ్తుంటే దండగ అని మాట్లాడటం వైసీపీ మార్క్
వైసీపీ పెట్టుబడుల గురించి మాట్లాడితే అన్నీ గుర్తొస్తాయి !
నిజానికి పెట్టుబడుల గురించి వైసీపీ మాట్లాడకపోతేనే ఆ పార్టీ పరువు దక్కుతుంది. గత ప్రభుత్వ హయాంలో దావోస్ పర్యటనల పేరుతో వెళ్లి, అక్కడ ఖాళీగా ఉన్న స్టాళ్లలో కూర్చుని బిక్కమొహాలు వేసిన ఫోటోలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. అక్కడి దాకా వెళ్లి .. ఇటీవల ఏపీ నుంచి పారిపోతున్నాయని జగన్ చెప్పుకున్న తన బినామీ సంస్థల పెట్టుబడులతో ఒప్పందాలు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదు. పైగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయిన వైనం అందరికీ తెలిసిందే. అప్పుడు చేసిన విఫల యత్నాలను మర్చిపోయి, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్కువ చేసి మాట్లాడటం వైసీపీ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది.
చంద్రబాబు ఇమేజ్‌తో మళ్లీ ఏపీకి దావోస్‌లో గౌరవం
మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు అవకాశాలను వివరిస్తూ.. పరిశ్రమలను ఆకర్షిస్తూంటే.. వైసీపీ మాత్రం పాత పద్ధతిలోనే అడ్డుతగిలే ప్రయత్నం చేస్తోంది. అమర్నాథ్ వంటి నాయకులను రంగంలోకి దింపి పరువు పోగొట్టుకోవడం కంటే, రాష్ట్ర అభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలను నిర్మాణాత్మకంగా విమర్శించడం బాగుంటుందని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఏదేమైనా, పెట్టుబడుల విషయంలో వైసీపీ ట్రాక్ రికార్డు చూశాక, వారు చేసే విమర్శలు ఆ పార్టీకే చేటు తెచ్చేలా ఉన్నాయి. అయినా ఆ పార్టీ మారదుగా !