logo

ఉపాధి ఊపిరితీస్తున్న కేంద్రం : సీపీఎం

నిరుపేదలకు, వెనుకబడిన తరగతులకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జీవనోపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నాల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని సీపీఎం ఆరోపించింది.
ఈ విధానాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సీపీఎం చేపట్టింది.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఈరోజు పెనుగొండ రాజగూడెం, దక్షిణ వీధుల్లో ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు లబ్ధిదారులతో మాట్లాడుతూ, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల పని హక్కును కాలరాస్తోందని, మహాత్మా గాంధీ పేరును తొలగించి వీ బి జి రాం జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చి పాత ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

అలాగే ఈ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుని, రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని, దీని వల్ల రానున్న కాలంలో ఉపాధి పేదలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
వ్యవసాయ పనులు ఉన్న రోజుల్లో మాత్రమే పనులు కల్పించేలా కొత్త చట్టంలో తిరోగమన విధానాలు తీసుకొచ్చారని, ఇది భూస్వాములకు అనుకూలంగా ఉండేలా ఉపాధి చట్టాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నమని ఆరోపించారు.

ప్రజలు దీనిని అడ్డుకుని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కొత్త పథకాన్ని రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని సీపీఎం పిలుపునిచ్చింది.
ఫిబ్రవరి 12న జరగనున్న అఖిల భారత సమ్మెలో ఉపాధి కార్మికులందరూ పాల్గొని నిరసనలు తెలపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్. వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి షేక్ పాదుషా, గుర్రాల సత్యనారాయణ, పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

0
252 views